24-05-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, మే 24: తెలంగాణ గనులు, భూగర్భ శాఖలో అవినీతి ఆరోపణలతో ఆరుగురు అధికారులపై ప్రభుత్వం వేటేసింది. గనుల శాఖలో డిప్యుటేషన్ పై జీఎంలుగా పని చేస్తున్న పాండురంగారావు, దేవేందర్ రెడ్డి, ప్రశాంతి, ప్రాజెక్టు ఆఫీసర్స్ దశరథం, తోట శ్రీధర్, సూపరింటెండెంట్ శ్రీనివాస్‌లను మాతృ సంస్థలకు బదిలీ చేసింది. అధికారుల అవినీతిపై ఫిర్యాదులు రావడంతో విచారణ జరిపి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అవినీతి, ఆక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకుంటోంది.
ఇటీవల ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వర్ రావును అరెస్టు చేయడం కలకలం రేపిన సంగతి తెలిసిందే.. అంతకుముందు ఫోన్ల ట్యాపింగ్ కేసులో ఎస్‌ఐబీ ఇన్ స్పెక్టర్‌గా పనిచేసిన ప్రణీత్ రావును అరెస్టు చేసిన విషయం తెలిసిందే అదే కేసులో పోలీసు అధికారులు భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు అరెస్టయి జైల్లో ఉన్నారు. ఎస్ ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కు రెడ్ కర్నార్ నోటీసులు జారీ కాబోతున్నాయి. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ కేసును తారుమారు చేసేందుకు యత్నించిన పంజాగుట్ట సీఐ దుర్గారావుపై సర్కారు సస్పెన్షన్ వేటు వేసింది. ఈ వ్యవహారాన్ని లోతుగా పరిశీలించి సంచలన నిర్ణయం తీసుకున్నది. ఠాణా మొత్తాన్ని ట్రాన్స్ ఫర్ చేయడం కలకలం రేపింది.