24-05-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, మే 24: రాష్ట్రంలో నకిలీ విత్తనాలపై ప్రబుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఎక్కడ సమాచారం వచ్చినా వెంటనే అరికట్టి, నకిలీ విక్రేతలను అరెస్ట్ చేస్తోంది. తాజాగా ఆదిలాబాద్ పట్టణంలో,జడ్చర్లలో నకిలీ పత్తి విత్తనాల తయారీ కేంద్రం గుట్టురట్టయింది. శుక్రవారం మధ్యాహ్నం ఆదిలాబాద్ రాంనగర్ ప్రాంతంలో గోదాంలో నకిలీ విత్తనాలు తయారీ కేంద్రంపై పోలీసులు దాడి చేసి నిర్వాహకుడితో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వివిధ కంపెనీలకు చెందిన 945 పత్తి విత్తనాల ప్యాకెట్లతో పాటు 50 కిలోల విడి పత్తి విత్తనాలు, 330 బ్యాగులు జొన్న విత్తనాలు, నకిలీ విత్తనాల తయారీకి ఉపయోగించే కలర్, కెమికల్‌ను పట్టుకున్నారు. వీటి విలువ రూ.19,39,908 ఉంటుందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పుల్లయ్య తెలిపారు. విత్తన కేంద్రం నిర్వాహకుడు సామ అశోక్ రెడ్డితో పాటు అందులో పనిచేసే మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అలాగే మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలంలో నకిలీ పత్తి విత్తనాలుపట్టుబడిన ఘటన చోటు చేసుకున్నది. జడ్చర్ల మండలం గోప్లాపూర్ గ్రామంలో వ్యవసాయ, పోలీసుశాఖ అధికారులు సంయుక్తంగా దాడులు చేసి ఓ ఇంట్లో నిల్వ ఉంచిన 2.21 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నారు. ఈ క్రమంలో జడ్చర్ల పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఏఎస్పీ రాములు విలేకరులతో మాట్లాడారు. గోప్లాపూర్‌లో ప్రభాకర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి నకిలీ పత్తి విత్తనాలు విక్రయించేందుకు విత్తనాలు నిల్వ చేసినట్లు విశ్వసనీయ సమాచారం అందిందన్నారు. దీంతో వ్యవసాయ, పోలీసు శాఖ అధికారులు సంయుక్తంగా దాడి చేసి 2.21 క్వింటాళ్లు నకిలీ పత్తి విత్తనాలు పట్టుకున్నారని తెలిపారు. విత్తనాలను స్వాధీనం చేసుకొని ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. సమావేశంలో జడ్చర్ల సీఐ ఆదిరెడ్డి, వ్యవసాయాధికారులు, పోలీసులు పాల్గొన్నారు.