24-05-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, మే 24: తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిచ్చింది. జూన్ 2న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదే రోజు గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద సీఎం రేవంత్‌రెడ్డి నివాళులు అర్పించనున్నారు. ఈసీ నుంచి అనుమతి లభించిన నేపథ్యంలో వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు చేయలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వివిధశాఖల అధికారులను ఆదేశించారు. దశాబ్ది వేడుకలు కావడంతో ధూమ్‌ధామ్‌గా చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో తెలంగాణ ఉద్యమకారులను సిఎం రేవంత్ సన్మినించే అవకాశం ఉంది. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి శుక్రవారం ఉన్నతాధికారులతో సవిూక్షించారు.
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించేందుకు ఈసీ ప్రభుత్వానికి అనుమతి ఇవ్వడంతో, అందుకు తగిన విధంగా విస్తృత ఏర్పాట్లు చేయాలని శాంతి కుమారి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించ నున్నట్లు తెలిపారు. సీఎం ముందుగా గన్ పార్క్‌ను సందర్శించి తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు నివాళులర్పిస్తారని అన్నారు. ఈ సందర్భంగా పరేడ్ గ్రౌండ్ వద్ద చేపట్టాల్సిన ఏర్పాట్ల పై అధికారులకు సీఎస్ దిశానిర్దేశం చేశారు. ప్రముఖులు ప్రయాణించే మార్గాలలో అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని, పార్కింగ్ స్థలాలను కేటాయించేటప్పుడు ట్రాఫిక్ రూట్ మ్యాప్‌ను సిద్ధం చేసి ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా జాగ్రత్తలు చేపట్టాలని పోలీసు శాఖను ఆదేశించారు.
సభా ప్రాంగణం పరిసర పారంతాలలో పారిశుధ్య పనుల నిర్వహణ తోపాటు తాగునీటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, రోడ్డుకు ఇరువైపులా రంగురంగుల జెండాలను అలంకరించాలని జీహెచ్ఎంసీ అధికారులకు సూచించారు. పండుగ వాతావరణాన్ని తలపించేలా కళాకారులతో ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని సాంస్కృతిక శాఖను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని అన్నారు.