24-05-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, మే 24: గత ఆరు నెలలుగా తెలంగాణలో రూ. 4 వేల కోట్లు అక్రమంగా వసూలు చేసి, రాహుల్ గాంధీకి పంపిస్తున్నారని బీజేపీ నేత ఈటల రాజేందర్ ఆరోపించారు. పరకాలలో నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘‘సాక్షాత్తూ దేశ ప్రధానమంత్రే ఈ గడ్డ మీదకు వచ్చి ఈ ప్రభుత్వం డబుల్ ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తోందని చెప్పాడంటే ఆలోచించండి. ప్రతీ ఒక్కరూ బీజేపీ తరపున ప్రేమేందర్ రెడ్డికే ఓట్లు వేస్తామంటున్నారు. గత ప్రభుత్వం కానీ, ప్రస్తుత ప్రభుత్వం కానీ ఏళ్లుగా టీచర్లకు జీతాలు చెల్లించడం లేదు. గతంలో కేసీఆర్ అన్యాయం చేసినందుకు ఇంటికి పంపించారు. బీఆర్‌ఎస్ పార్టీ పదేళ్లుగా డీఏలు చెల్లించలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా తమ హామీలు నిలబెట్టుకోలేదు. ఈటల రాజేందర్ అన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా హామీలు నిలబెట్టుకోలేనందుకు బుద్ది చెప్పాలి. నిజాలు తెలుసుకుని ఓటును సద్వినియోగం చేసుకోవల్సిందిగా కోరుతున్నాను. అని ఆయన వ్యాఖ్యానించారు. ఎత్తిన జెండా దించకుండా, నమ్మిన సిద్దాంతం కోసం ప్రజల కోసం పార్టీ కోసం జీవించిన వ్యక్తి ప్రేమేందర్ రెడ్డి అని ఈటల రాజేందర్ అన్నారు.
నల్గొండలో ఒక వ్యక్తి నడమంత్రపు సిరితో బీజేపీ ఎక్కడుంది అని అడిగాడు. 4 వ తేదీన తెలుస్తుందని చెప్పి వచ్చా. చాపకింద నీరులా తెలంగాణలో బీజేపీ పార్టీ బలం పుంజుకుంటోంది. చీమలు పుట్టలు పెడితే పాములు దూరినట్లు, మనమందరం కొట్లాడితే తెలంగాణ వచ్చింది. దీనిలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. ప్రశ్నించే గొంతు అంటూ మాట్లాడుతూ ఉంటారు ముఖ్యమంత్రి. కానీ ఇప్పుడు అధిష్టానం చేతిలో పిల్లిలా తయారయ్యారు. అధికార పార్టీలో ఉంటే ప్రశ్నించే అవకాశం ఉండదు. నేను పది రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా ఎంతోమందితో భేటీలు, మీటింగులు నిర్వహించాను. అడ్వకేట్లతో, డాక్టర్లతో, నిరుద్యోగులతో, ఉపాధ్యాయులతో, ఉద్యోగులతో, అంగన్ వాడీలతో, ప్రైవేట్ ఉద్యోగులతో సమావేశాలు జరిగాయి. వారందరూ ఎన్నో బాధలు చెప్పుకున్నారు. శాసన సభలో కొట్లాడడానికి మనపార్టీ వాళ్లున్నారు. అలాగే శాసన మండలిలో కూడా ఏవీఎన్ రెడ్డి గారితో పాటు ప్రేమేందర్ రెడ్డి కూడా కొట్లాడడానికి రెడీగా ఉన్నారు. గత రెండు దశాబ్దాలుగా ప్రజాజీవితంలో ఉన్నాం. ప్రజల పక్షాన నిలబడి కొట్లాడడానికి బీజేపీ పార్టీ ఎప్పుడూ సిద్దంగా ఉంటుంది.’’ అని ఈటల పేర్కొన్నారు.
ఆగస్టు 15 లోపల రుణమాఫీ చేయడం అసాధ్యమని మాజీ మంత్రి బీజేపీ నేత ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో, పాలకుర్తి నియోజకవర్గం స్థాయి, వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల ఎన్నికల సందర్భంగా పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఈటట మాట్లాడుతూ.. ఆగస్టు 15 లోపల రుణమాఫీ చేయడం అసాధ్యమని అన్నారు. ఇంత తక్కువ కాలంలో ప్రజల చేత చీత్కరింపబడిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానిది అన్నారు. తెలంగాణలో నిరుద్యోగులను మోసం చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని, ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు 4000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తానని ఇప్పటికీ అమలు చేయలేదన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేశాయన్నారు. ఆరోగ్యశ్రీ బకాయిలను చెల్లించలేని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం చేయించుకోవాలని నిరుపేదలు ఆస్తుల అమ్మి వైద్యం చేయించుకుంటున్నారని తెలిపారు. నిరుపేదలకు వైద్యం ఖర్చులు పెట్టలేని కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు వేలకోట్ల రూపాయలు ఇస్తున్నారని అన్నారు.