25-05-2024 RJ
తెలంగాణ
ఆదిలాబాద్, మే 25: ఊహించినట్టుగానే ఈ ఏడాది కూడా జిల్లాలో పత్తి పంటే అధిక విస్తీర్ణంలో సాగు చేయవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. వరికి నీటి తడులు ఎకకువగా అవసరంతో పాటు, ఖర్చుకూడా తడిసి మోపెడు అవుతోంది. కూలీల సమస్య కూడా ఉంటోంది. దీనికితోడు పత్తి తప్ప ఏ పంట వేసినా కోతుల బెడద కూడా దెబ్బతీస్తోంది. ఈ క్రమంలో రైతులు వరికన్నా పత్తి మేలని భావిస్తున్నారు. మరోవైపు రైతుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని నకిలీ పత్తి విత్తన కంపెనీలు ఏటా ముంచుతున్నాయి. అయితే ఈయేడు ఇప్పటినుంచే దాడులు చేసి పట్టుకుంటున్నారు. రైతులు విత్తన కొనుగోళ్లో జాగ్రత్తగా ఉండేలా హెచ్చరికలు చేస్తున్నారు. పత్తికి తోడు కంది, వరి, జొన్న, పెసర, మినుములు వంటి ఇతర పంటలను కూడా సాగు చేయవచ్చని అధికారులు సూచనలు వేశారు. ఇవి కాకుండా పోషకాహార పంటలైన చిరుధాన్యాల పంటలను సాగు చేసేందుకు ప్రత్యేకంగా చర్య లు చేపడుతున్నారు.
ఇందుకు గాను వందశాతం సబ్సిడీపై రైతులకు చిరుధాన్యం విత్తనాలను పంపిణీ చేయనున్నారు. ఇవి కాకుండా ఉద్యానవనశాఖ ద్వారా వివిధ రకాల కూరగాయాల పంటలు సాగు అయ్యే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ముఖ్యంగా కాగజ్ నగర్, ఆసిఫాబాద్ పట్టణాలకు సవిూపంలో ఉండే మండలాల్లో కూర గాయాల సాగును ప్రొత్సహించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నారు. జిల్లాలో పత్తి సాగుకు సంబంధించి యేటా అంచనాలకు మించి ఉంటున్న నేపథ్యంలో సీజన్ ప్రారంభమైన తర్వాత సాగు విస్తీర్ణం కాస్తా అటు ఇటుగా మారే అవకాశాలున్నాయని చెబుతున్నారు. దుక్కులు చేస్తూ తొలకరి వర్షానికే విత్తనాలు పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మెట్ట పంటలను పక్కన పెడితే వరి సాగులో జీలుగ పంటను నాటి రసాయన ఎరువుగా రైతాంగం ఉపయోగిస్తున్నది. విత్తనాలను జిల్లాలోని మండలాల పరిధిలో ఉన్న ఆగ్రో సెంటర్లు, ప్రాథమిక సహకార సంఘాలు, సీసీ ఎం ఎస్ విక్రయ కేంద్రాల్లో అందు బాటులో ఉంచారు.
జిలుగ విత్తనాలను కావాలనుకునే రైతాంగం సంబంధిత మండలాలకు చెందిన వ్యవసా యాధికారుల నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకొని కొనుగోలు కేంద్రాల్లో రాయితీపై ఈ విత్తనాలను పొందే వీలు కల్పించారు. అవసరమైన ఎరువులు, విత్తనాలు..వానాకాలం పంటల సాగుకు రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచేందుకు జిల్లా వ్యవసాయ శాఖ కసరత్తు పూర్తి చేసింది. రైతులు ఏ విత్తనం కొనుగోలు చేసినా దుకాణాల నుంచి రశీదులు తప్పకుండా తీసుకొని భద్రపరుచుకోవాలన్నారు.విత్తనాల నాణ్య తలేని కారణంగా రైతులు పంటలు నష్టపోతే ఆ రశీదుల ఆధారంగా సదరు కంపెనీలపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.