25-05-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, మే 25: రోహిణి కార్తె శనివారం మే25న ప్రారంభమైంది. దీని ప్రభావం శుక్రవారం నుంచే మొదలయ్యింది. జూన్ 8 వరకూ ఉంటుంది. దాదాపు 15 రోజుల పాటూ ఎండలు మండి పోనున్నాయి. నాలుగు నెలల ఎండాకాలంలో ఎండలు తొలి రోజుల్లో కొద్దికొద్దిగా పెరిగి ఉగాది నుండి వేసవితాపం పెరుగుతుంది. దిన దిన ప్రవర్దనమానంగా సూర్య భగవానుడు తన ప్రతాపాన్ని చూపిస్తాడు. రోహిణి కార్తె 15 రోజుల్లో సూర్యుడి తీవ్రత తారాస్థాయికి చేరి ఆ తర్వాత నుంచి మళ్లీ నెమ్మదిగా తగ్గుతూ ఉంటుంది. రోహిణి తరవాత మృగశర కార్తె ఆరంభం అవుతుంది. వర్షాలు పడడంతో అప్పుడు వాతావరణం చల్లబడుతుంది. 27 నక్షత్రాలు, గ్రహాల ఆధారంగా పంచాంగాలు తయారు చేశారు. జాతకాలు నిర్ణయిస్తారు. సూర్యోదయం సమయానికి ఏ నక్షత్రం చంద్రుడికి దగ్గరగా ఉంటే ఆ రోజుకు ఆ నక్షత్రం పేరు పెట్టారు. పౌర్ణమి రోజు చంద్రుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ నెలకు ఆ పేరు పెట్టారు. కానీ తెలుగు రైతులు మాత్రం ఇవే నక్షత్రాలతో వ్యవసాయ పంచాంగం తయారు చేసుకున్నారు. ఈ నక్షత్రాలను కార్తెలు అని పిలుచుకుంటున్నారు.
రైతుల లెక్కల ప్రకారం సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలానికి ఆ కార్తె పేరు పెట్టారు. అలా సంవత్సరానికి 27 కార్తెలు. తెలుగు రైతులంతా తమ అనుభవం నుంచి సంపాదించుకున్న వ్యవసాయ విజ్ఞానాన్ని కార్తెలుగా వాటిని అందరకీ అర్థమయ్యేలా సామెతల రూపంలో అందరకీ అర్థమయ్యేలా చెప్పారు. అందులో ఒకటి రోహిణి కార్తె. రోహిణి కార్తెలో రోళ్లు పగిలే ఎండలు అని నిర్ధారించారు. మాములుగా ఉండే ఎండల వేడినే తట్టుకోలేమంటే ఎండాకాలంలో చివరి కార్తె అయిన రోహిణిలో ఎండలు దంచికొడతాయి. అన్ని కార్తెల కన్నా రోహిణి కార్తె అంటే బంబేలెత్తిపోతారు. ఈ కార్తెలో ఎండలు మండిపోతాయని చెప్పడానికి బదులు రోహిణి కార్తెలో ఎండలకు రోళ్లు పగులుతాయంటారు.అంటే వేడి తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో అని చెప్పడమే దీని ఉద్దేశం.
వానలు సరైన సమయంలో పడితే రోహిణి కార్తెలోనే వ్యవసాయ పనులు ప్రారంభం అవుతాయి. దీంతో రైతులు పంటలు సాగు చేసేందుకు ముందుకు వస్తారు. రోళ్లు పగిలే ఎండలతో ఉక్కిరిబిక్కిరి చేసి రోహిణి కార్తెతో ఎండాకాలం అంతమైపోతుంది. దీని తరువాత ఒక్కో కార్తె వస్తూ ఉంటాయి. ఇలా వ్యవసాయ దారాలు ఒక్కో కార్తెలో ఒక్కో రకమైన వ్యవసాయ పనులు చేస్తుంటారు. ఎండలు మండే రోహిణి కార్తెలో పశువులు, పక్షులకు తాగేందుకు ఎక్కడిక్కకడ నీళ్లతొట్టెలు ఏర్పాటు చేయడం చాలా మంచిది. విూరు ప్రత్యేకంగా ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు..కనీసం విూ ఇంటి చుట్టుపక్కలైనా మూగజీవాలకు నీళ్లు అందించండి. చలివేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల కూడా విూకున్న గ్రహదోషాల నుంచి విముక్తి లభిస్తుందని చెబుతారు పండితులు.