25-05-2024 RJ
ఆంధ్రప్రదేశ్
విజయవాడ, మే 25: విజయవాడలో పలు ప్రాంతాల్లో శనివారం ఉదయం నుంచి వర్షం కురిసింది. దీంతో రహదారులు జలమయమై.. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. బెంజి సర్కిల్, మొఘల్రాజపురం, ఏలూరు రోడ్డు తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాల్లోకి వరద చేరింది. మరోవైపు అనంతపురం జిల్లా ఉరవకొండ, విడపనకల్లు మండలాల్లో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. బూదగవి చెరువు అలుగు పారుతోంది. విడపనకల్లు మండలంలో పలుచోట్ల విద్యుత్ స్తంభాలు కూలాయి. దీంతో 19 గ్రామాలకు రాత్రి నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పెంచులపాడు, పొలికి, పాల్తూరు, గోవిందవాడ గ్రామాల మధ్య వాహన రాకపోకలు నిలిచిపోయాయి. పొలాల్లో నీరు నిలిచి చెరువులను తలపిస్తున్నాయి. వాయుగుండం ప్రభావంతో కాకినాడ జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల శుక్రవారం భారీ వర్షం పడిరది. ఈదురుగాలులతోపాటు కుండపోతగా వాన కురిసింది. కాకినాడ నగరంలో ఏకధాటిగా మూడు గంటలపాటు వర్షం కుంభవృష్టిగా కురిసింది.
దీంతో ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి 8.30 వరకు ఏకంగా 10.3 సెంటీవిూటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షానికి ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. ఈదురుగాలులకు పలుచోట్ల విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. వాయుగుండం ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఈనేపథ్యంలో ఈనెల 27వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకువెళ్లొద్దని హెచ్చరికలు జారీ అయ్యాయి. శనివారం పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండీ కూర్మనాథ్ తెలిపారు. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అనకాపల్లి జిల్లాల్లోని 35 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశముందని చెప్పారు.