27-05-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, మే 27: రాష్ట్ర అధికారిక చిహ్నంపై చిత్రకారుడు రుద్ర రాజేశంతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. ఈ సందర్భంగా పలు నమూనాలను సీఎం రేవంత్ పరిశీలించారు. తుది నమూనాపై సీఎం పలు సూచనలు చేశారు. అధికారంలోకి రాగానే తెలంగాణ తల్లి విగ్రహం నమూనాను కూడా మార్చాలని సిఎం రేవంత్ నిర్ణయించారు. అలాగే రాష్ట్రగీతంగా అందెశ్రీ రాసిన జయజయహేకు పచ్చజెండా ఊపారు. అలాగే రాష్ట్ర చిహ్నం కూడా తెలంగాణ కు అద్దంపట్టేలా ఉండాలని ఆకాక్షించారు. ఈ క్రమంలో దానిని మార్చాలని నిర్ణయించారు. అయితే రాష్ట్ర అధికారిక చిహ్నంను మార్చొద్దని పలువురు రాజకీయ నాయకులు, మేధావులు రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణ కోడ్ టీఎస్ స్థానంలో టీజీ తీసుకొచ్చారు.
టీఎస్ స్థానంలో టీజీ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు, ఏజెన్సీలు, స్వయం ప్రతిపత్తి గల సంస్థలు, కార్పొరేషన్లు, వెబ్‌సైట్లు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు ఏదైనా ఇతర అధికారిక కమ్యూనికేషన్లు సైతం తెలంగాణ కోడ్‌ను టీఎస్ బదులుగా టీజీగా ఉపయోగిస్తున్నారు. లెటర్ హెడ్స్ రిపోర్టులు, నోటిఫికేషన్లు, అధికారిక వెబ్ సైట్లు, ఆన్‌లైన్ జీవోలు ఇతర అధికారిక వెబ్ సైట్లు ఆన్‌లైన్ జీవోల్లో టీజీగా మార్చారు. ఈ క్రమంలో త్వరలోనే అంటే జూన్ రెండు నాటికి రాష్ట్ర చిహ్నం అధికారికంగా ఖరారు అయ్యే అవకాశం ఉంది.