27-05-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, మే 27: శుభమా అని కూతురి ఎంగేజ్‌మెంట్ చేసుకుంటుంటే లిప్ట్ ప్రమాదం ఇరు కుటుంబాలను ఇబ్బందికి గురి చేసింది. నాగోల్ పీఎస్ పరిధి సాయినగర్ కినార గ్రాండ్ హోటల్‌లో సాంకేతిక లోపంతో లిప్ట్ ప్రమాదం జరిగింది. నాగోల్‌కు చెందిన మాల్యాద్రి అనే వ్యాపారి కుమార్తె ఎంగేజ్‌మెంట్ వేడుక కినార గ్రాండ్ హోటల్లో నిర్వహించారు. 8 మంది అతిథులు ఫోర్త్ ప్లోర్ నుంచి లిప్ట్‌లో కిందకు వెళుతుండగా సాంకేతిక లోపంతో సెల్లార్ వరకూ అతివేగంగా చేరుకుంది. భయాందోళనలకు గురైన వారు కేకలు పెట్టారు. సెక్యూరిటీ సిబ్బంది లిప్ట్ డోర్స్ విరగ గొట్టి లోపల ఉన్న వారిని బయటకు తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ముగ్గురికి కాళ్లు ఫ్రాక్చర్ అయ్యాయి. మరో ముగ్గురు స్వల్ప గాయాలయ్యాయి. స్వల్ప గాయాలైన ముగ్గురినీ 108 వాహనంలో కామినేని ఆస్పత్రికి తరలించారు.
ఇద్దరు మాత్రం క్షేమంగానే ఉన్నట్టు తెలుస్తోంది. వీరబ్రహ్మం, రవిశంకర్ రెడ్డి, మణికొండ గుప్తాలకు స్వల్ప గాయాలు కాగా.. మనోహర్, షాహిద్ బాబా, కళ్యాణ్ కుమార్ల కాళ్లకు ఫ్రాక్చర్ అయినట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న ఎస్‌హెచ్‌ఓ పరశురామ్, ఎస్‌ఐ శ్రీనివాస్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మాల్యాద్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద సమయంలో లిప్ట్‌లో ఎంత మంది ఉన్నారన్నది తెలియరాలేదు. అయితే ఎనిమిది మందికి తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది. వీరంతా హోటల్‌లో జరిగిన ఎంగేజ్ మెంట్ ఫంక్షన్‌కి వచ్చినట్లు తెలుస్తుంది. గాయపడినవారిని వెంటనే ఎల్బీ నగర్ కామినేని ఆసుపత్రికి హుటాహుటిన తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు.