27-05-2024 RJ
సినీ స్క్రీన్
పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న సినిమాల్లో ’ఒ.జి’ ఒకటి. సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. డి.వి.వి.దానయ్య నిర్మాత. చిత్రీకరణ దాదాపు చివరి దశకు చేరుకుంది. ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని పంచుకున్నారు దర్శకుడు సుజీత్. ’భజే వాయు వేగం’ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఆ చిత్ర కథానాయకుడు కార్తికేయ, దర్శకుడు సుజీత్ కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ’ఒ.జి’ సినిమా ప్రస్తావన రాగా, ఆ సంగతుల్ని పంచుకున్నారు సుజీత్. ‘పవన్‌కల్యాణ్ సినిమాల్లో జపనీస్ సినిమాల ప్రభావం చాలా ఉంటుంది. పాటల్లోనూ, ఇతర సన్నివేశాల్లోనూ అది కనిపిస్తూ ఉంటుంది. అవకాశం వస్తే పవన్‌కల్యాణ్‌ని ఆ నేపథ్యంలో చూపించాలనుకున్నా. ’ఒ.జి’తో అది నెరవేరింది. ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ అనే మాట నుంచే ’ఒ.జి’ అనే పేరు పుట్టింది.
అయితే సినిమాలో పవన్‌కల్యాణ్ పాత్ర పేరు ఓజాస్ గంభీర. గంభీర ఆయన పేరు, ఓజాస్ అనేది మాస్టర్ పేరు‘ అని చెప్పుకొచ్చారు సుజీత్. మొదట తనను రీమేక్ సినిమా కోసం పిలిచినట్టు చెప్పారు సుజీత్. ‘పవన్‌కల్యాణ్‌తో ఒరిజినల్ కథ చేయడంలో ఉన్న అనుభూతి, కిక్ వేరు. అదృష్టవశాత్తూ ఒక రోజు ’కొత్త కథ ఏదైనా ఉందా? అని అడిగారు పవన్‌కల్యాణ్. ఇన్ని రోజులు ఎదురు చూసినందుకు ప్రకృతి అలా సహకరించింది. ఒక్క లైన్ చెప్పగానే ఆయన చేయడానికి అంగీకారం తెలిపార‘న్నారు సుజీత్. ’ఒ.జి’లో పవన్‌కల్యాణ్ సరసన ప్రియాంక మోహన్ నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హస్మి కీలక పాత్ర పోషిస్తున్నారు.