27-05-2024 RJ
ఆంధ్రప్రదేశ్
గుంటూరు, మే 27: ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు తాళలేక ఓ ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. నదిలో విద్యార్థి మృతదేహం లభ్యం కావడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఇతర మీడియాలో వస్తున్న వార్తా కథనాలు ప్రకారం.. ఏపీలోని విజయవాడకు చెందిన వంశీ అనే విద్యార్థి ఇంజినీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. అయితే, అతను ఇంట్లోవాళ్లకు తెలియకుండా లోన్ యాప్ లో రూ. 10 వేల రుణం తీసుకున్నాడు. ఆ లోన్ యాప్ నిర్వాహకులు రూ. లక్ష వరకు డబ్బులు చెల్లించాలంటూ అతడిని వేధించారని, దీంతో అతను ఆ విషయాన్ని ఇంట్లోవాళ్లకు చెప్పకుండా భయపడి ఈ నెల 25 న ఇంటి నుంచి వెళ్లిపోయాడని తెలుస్తోంది.
అయితే, తాను చనిపోతున్నానంటూ కుటుంబ సభ్యులకు మెసేజ్ పెట్టాడు. ఆ మెసేజ్ చూసి ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు అతడికి ఫోన్ చేయగా అతడి ఫోన్ స్విచ్ఛాప్ వచ్చింది. దీంతో అతని కుటుంబ సభ్యులు రెండు రోజులుగా అతని ఆచూకీ కోసం గాలించారు. ఈ క్రమంలో గుంటూరు జిల్లా తాడేపల్లిలోని కృష్ణా నది వద్ద అతడి మొబైల్ ఫోన్, చెప్పులు, బైక్ కనిపించాయి. అనుమానంలో నదిలో గాలింపు చేపట్టగా అతడి మృతదేహాన్ని గుర్తించారు. తండ్రి ఫిర్యాదు మేరకు తాడేపల్లి పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.