27-05-2024 RJ
తెలంగాణ
కరీంనగర్, మే 27: కోరుట్ల కాంగ్రెస్ ఇంఛార్జ్ జువ్వాడి నర్సింగరావు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికల్లో తన ఓటమికి కేసీఆరే కారణమన్నారు. ఎమ్మెల్యేగా కల్వకుంట్ల సంజయ్ గెలుపులో ఆయన ప్రముఖ పాత్ర పోషించారన్నారు. ఎన్నికల సమయంలో తన పోన్ ట్యాప్ చేసి ప్రతి కదలికా తెలుసుకున్నారని ఆరోపించారు. ఇదే విషయాన్ని ఫోన్ ట్యాపింగ్ కేసులో అరస్టయిన రాధాకిషన్ వాగ్మూలం ఇచ్చారన్నారు. కేసీఆర్, ఎమ్మెల్యే సంజయ్‌కు నైతిక విలువలు లేవని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేగా కొనసాగే హక్కు సంజయ్‌కు లేదని.. వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు అధికార యంత్రాంగాన్ని సైతం కేసీఆర్ దుర్వినియోగం చేశారని నర్సింగరావు అన్నారు.
గెలుపే లక్ష్యంగా ఎన్ని అక్రమాలు చేయాలో చేసి ఇప్పడు అడ్డంగా దొరికిపోయిన తర్వాత కేసీఆర్ బుకాయిస్తున్నారని మండిపడ్డారు. ట్యాపింగ్ చేసి రాధాకిషన్ దొరికిపోయిన తర్వాత ఆయన ఎవరో తెలియదంటూ కేసీఆర్ చెప్పడం హాస్యస్పదమన్నారు. కల్వకుంట్ల కుటుంబానికి, మాజీ మంత్రి హరీష్‌రావుకు వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని ప్రశ్నించారు.