27-05-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, మే 27: ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్తున్న తెలుగు విద్యార్థులు ఇటీవల పలు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా, ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన తెలంగాణ యువతి అక్కడ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. మృతురాలిని తెలంగాణకు చెందిన గుంటిపల్లి సౌమ్యగా గుర్తించారు. ఆమె స్వస్థలం యాదగిరిగుట్ట శివారులోని యాదగిరిప్లలె కాగా.. స్వగ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గ్రామస్థులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సౌమ్య న్యూయార్క్‌లో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా.. అతివేగంతో వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
సౌమ్య చదువుతో పాటు పార్ట్ టైం జాబ్ కూడా చేస్తున్నట్లు ఆమె తల్లిదండ్రులు తెలిపారు. ఉన్నత స్థాయికి ఎదుగుతుందనుకున్న తమ బిడ్డ రోడ్డు ప్రమాదంలో దూరం కావడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. యువతి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అటు, ఏపీకి చెందిన తెలుగు విద్యార్థి బెలెం అచ్యుత్ అనే యువకుడు ఇటీవల న్యూయార్క్ నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. అచ్యుత్ నగరంలోని న్యూయార్క్ స్టేట్ యూనివర్శిటీలో విద్య అభ్యసిస్తున్నాడు. ఈ నెల 22న బుధవారం సాయంత్రం బైక్‌పై వెళ్తుండగా ఎదురుగా వచ్చిన మరో వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయాన్ని అమెరికాలోని భారత రాయబార కార్యాలయం ధ్రువీకరించింది. ’న్యూయార్క్ స్టేట్ వర్శిటీకి చెందిన విద్యార్థి అచ్యుత్ బైక్ ప్రమాదంలో బుధవారం మధ్యాహ్నం మృతి చెందడం విచారకరం.
అతని అకాల మరణం గురించి తెలిసి చాలా బాధపడ్డాం. మృతుడి కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం. బాధిత కుటుంబం, స్థానిక ఏజెన్సీలతో సంప్రదింపులు జరుపుతున్నాం. మృతదేహాన్ని త్వరలో భారత్ కు పంపించేందుకు బాధిత కుటుంబానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం.’ అని ట్వీట్ చేసింది. కాగా, ఇటీవలే అమెరికాలోని అరిజోనాలో ఫజిల్ క్రీక్ ఫాల్స్‌లో ఇద్దరు తెలుగు విద్యార్థులు ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయారు. లక్కిరెడ్డి రాకేశ్ రెడ్డి, రోహిత్ మణికంఠ లేపాల అనే ఇద్దరు విద్యార్థులు జలపాతంలో ఈత కొడుతూ ప్రమాదవశాత్తు మునిగిపోయారు. గమనించిన స్నేహితులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వారి కోసం గాలించి మృతదేహాలను గుర్తించారు. మృతుల్లో తెలంగాణ విద్యార్థి లక్కిరెడ్డి రాకేశ్ రెడ్డి.. ఖమ్మం నగరంలోని విద్యా రంగ ప్రముఖులు లక్కిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఏకైక కుమారుడు. ఇతను కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాడు. ఇక మరో విద్యార్థి రోహిత్ మణికంఠ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఇక, ఏప్రిల్‌లో ట్రెక్కింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు జారి పడి ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి చెందిన ఘటన స్కాట్లాండ్‌లో జరిగింది. వీరిలో ఒకరు హైదరాబాద్ విద్యార్థి కాగా.. మరో విద్యార్థి ఏపీకి చెందినవారు. యూనివర్శిటీలో మాస్టర్స్ చదువుతున్న ఇద్దరు విద్యార్థులు.. పెర్త్ ్గªర్‌లోని లిన్ ఆఫ్ తమ్మెల్‌కు వెళ్లారు. అక్కడ ట్రెక్కింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు నీటిలో జారి పడి కొట్టుకుపోయారు. సమచారం అందుకున్న పోలీసులు వెంటనే గాలింపు చేపట్టి ఇద్దరి మృతదేహాలను గుర్తించారు. మృతులు జితేంద్రనాథ్ (26), చాణక్య (22)గా గుర్తించారు.