28-05-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, మే 28: తెలుగువారి ఆరాధ్యదైవం ఎన్టీఆర్ అని, రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన మహనీయుడని, ఎన్టీఆర్ పథకాలనే అందరూ అవలంబిస్తున్నారని నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. దివంగత నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకలు తెలుగు రాష్ట్రంలో ఘనంగా జరుగుతున్నాయి. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయన అభిమానులు, టీడీపీ నేతలు నివాళులర్పిస్తున్నారు. నందమూరి కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఘనంగా ఎన్టీఆర్‌కు అంజలి ఘటించారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద తన తండ్రికి నివాళులు అర్పించిన బాలయ్య.. మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ అంటే ఒక శక్తి.. తెలుగువారి ఆరాధ్యదైవం. సాధారణ రైతు కుటుంబంలో పుట్టి సినీ రంగంలో మకుటంలేని మహారాజుగా, అలాగే రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన మహనీయుడు. ఇప్పుడంతా ఎన్టీఆర్ తీసుకొచ్చిన పథకాలనే అవలంబిస్తున్నారు. చదువుకి ఆయన ఎంత ప్రాధాన్యత ఇచ్చారో అందరికీ తెలుసు. సినీ రంగంలో మకుటంలేని మహారాజుగా ఉన్న సమయంలోనే రాజకీయాల్లోకి వచ్చి.. అక్కడ కూడా పెనుమార్పుని తీసుకొచ్చారు.
తెలుగుజాతి ఆత్మగౌరవాన్నిచాటి చెబుతూ.. సామాన్య ప్రజలలో సైతం రాజకీయ చైతన్యం తీసుకొచ్చారు. ఎందరినో ఆయన రాజకీయాలలోకి తీసుకొచ్చారు. ముఖ్యంగా అధికారానికి దూరంగా ఉన్న బడుగు, బలహీనవర్గాలకు పదవులు ఇచ్చి.. ఎంతగానో ప్రోత్సహించారు. ఎన్నో సంస్కరణలు, మరెన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన ఘనత ఆయనకే సొంతం. పార్టీ నాయకులతో కలిసి తన తండ్రికి నివాళులర్పించిన బాలకృష్ణ.. ఎన్టీఆర్ అంటే నటనకు నిర్వచనమని, నవరసాలకు అలంకారమని చెప్పారు. ఆ మహానుభావుడు నటకు విశ్వవిద్యాలయమని తెలిపారు. ఎన్టీఆర్ స్ఫూర్తిని ఎంతోమంది అందిపుచ్చుకున్నారని వెల్లడిరచారు. తెలుగువారి ఆరాధ్యదైవం ఎన్టీఆర్ అని, రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన మహనీయుడని పేర్కొన్నారు. నాన్నగారి స్ఫూర్తితో మరింతగా ప్రజలకు సేవ చేస్తాం‘ అని నందమూరి బాలకృష్ణ చెప్పుకొచ్చారు.