28-05-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, మే 28: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. పార్టీ అధ్యక్షుడు కెసిఆర్ ఆదేశాలతో మూడురోజులు వివిధ కార్యక్రమాలు చేపడతారు. జూన్ 1 నుంచి 3వ తేదీ వరకు మూడురోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా ఈ వేడుకలను నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా మూడురోజుల కార్యక్రమాలను పార్టీ ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న తెలంగాణ భవన్‌లో నిర్వహించే ముఖ్య కార్యక్రమానికి కేసీఆర్ హాజరుకానున్నారు. ఈ వేడుకల్లో తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరులను స్మరించుకోనున్నారు. వారి త్యాగాలను గుర్తు చేసుకో నున్నారు. దశాబ్దకాలంపాటు ప్రగతిని సాధించి దేశానికే ఆదర్శంగా తెలంగాణను నిలిపిన ఘనత గత బీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనని కేసీఆర్ పునరుద్ఘాటించారు. ఈ చారిత్రక సందర్భంలో దశాబ్ది ముగింపు వేడులను ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి దాకా కార్యకర్తలు, పార్టీ అందించే సూచనలను అనుసరించి ముగింపు వేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
జూన్ 1న వనివారం గన్‌పార్ అమరవీరుల స్థూపం నుంచి ట్యాంక్‌బండ్‌పై ఉన్న అమరజ్యోతి వరకు రాత్రి 7 గంటలకు క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణత్యాగాలు చేసిన అమరులకు పుష్పాంజలి ఘటించి, ఘనంగా నివాళులు అర్పిస్తారు. జూన్ 2 ఆదివారం తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావించి దశాబ్ది కాలం గడుస్తున్న నేపథ్యంలో ముగింపు వేడుకల సభను పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన నిర్వహిస్తారు. అదేరోజు హైదరాబాద్‌లో పలు దవాఖానాలు, అనాథ శరణాలయాల్లో పార్టీ ఆధ్వర్యంలో పండ్లు, మిఠాయిలు పంపిణీ చేస్తారు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాల్లో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను, జాతీయ జెండాను ఎగరవేస్తారు. ఆయా జిల్లాల్లోని దవాఖానలు, అనాథ శరణాలయాల్లో స్వీట్లు, పండ్లు పంపిణీ చేస్తారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎక్కడిక్కడ పాల్గొనాలని సూచించారు.