28-05-2024 RJ
తెలంగాణ
ఖమ్మం, మే 28: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ విజయం ఖాయమని ఎమ్మెల్సీ తాతా మధు అన్నారు. ఇప్పటివరకు జరిగిన నాలుగు ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులే గెలిచారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని గ్రాడ్యుయేట్స్ తిరస్కరించారని వెల్లడిరచారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి రాకేశ్‌రెడ్డి మొదటి ప్రాధాన్యత ఓటుతోనే గెలువబోతున్నారని స్పష్టం చేశారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, పార్టీ నాయకులతో కలిసి ఆయన ఖమ్మంలో విూడియాతో మాట్లాడారు. రాకేశ్ రెడ్డికి మద్దతు తెలిపిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మోసకారి అని ప్రజలకు తెలిసి పోయిందన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. తెలంగాణ పట్ల బాధ్యత, అవగాహన లేని సీఎం రేవంత్ రెడ్డి అని విమర్శించారు.
తెలంగాణ చిహ్నం మారిస్తే ప్రజల బతుకులు మారవని ఆగ్రహం వ్యక్తంచేశారు. గొలుసుకట్టు చెరువులకు రూపకల్పన చేసిందే కాకతీయ రాజులన్నారు. తెలంగాణ అభివృద్ధికి గోల్కొండ నవాబులు చేసిన కృషిని మరువొద్దని సూచించారు. కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేసే దమ్ము ఎవరికీ లేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు కేసీఆర్ పేరు నిలిచి ఉంటుందని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్టాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపిందే కేసీఆరేనని చెప్పారు.