28-05-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, మే 28: సన్నబియ్యం టెండర్ల వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. సన్న బియ్యం టెండర్లను రద్దు చేసినట్టు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలిపారు. తమ వద్ద ఉన్న సన్నధాన్యంతో బియ్యం సరఫరా చేస్తామని పేర్కొన్నారు. దీంతో భారీ కుంభకోణానికి అడ్డుకట్ట పడిరదని, ప్రభుత్వానికి భారీ మొత్తంలో నష్టం తప్పినట్టయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కావాలనే టెండర్లలో ఎక్కువ ధరలు కోట్ చేశారని మాజీమంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. టెండర్లు కావాలనే వేశారని, ఆరోపణలు రావడంతో రద్దుచేశారని అన్నారు. ఇటీవల గురుకులాలతోపాటు మధ్యాహ్న భోజనం పథకం కోసం 2.20 లక్షల టన్నుల సన్న బియ్యం కొనుగోలుకు పౌరసరఫరాల సంస్థ టెండర్లు పిలించింది. టెండర్లలో నాలుగు సంస్థలు పాల్గొని బిడ్ దాఖలు చేశాయి. ఆయా కంపెనీలు రింగ్ అయినట్టుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నాలుగు సంస్థలు కూడా దాదాపు ఒకే ధరను కోట్ చేయడం గమనార్హం.
ఒక్కో సంస్థ కేవలం 10 పైసల తేడాతో బిడ్ దాఖలు చేసినట్టు తెలిసింది. సగటున కేజీకి రూ.57 చొప్పున ధర కోట్ చేశాయి. టెండర్లను బహిర్గతం చేసిన తర్వాత ధరపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. బహిరంగ మార్కెట్‌లోనే రూ.42-45 మధ్య కేజీ సన్న బియ్యం లభించే పరిస్థితి ఉంటే, రూ.57కు కొనుగోలు చేయాలన్న పౌరసరఫరాల శాఖ నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తాయి. టెండర్ల మాటున రూ.330 కోట్ల కుంభకోణం జరుగుతున్నదంటూ బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు ఆరోపించారు. ప్రతిపక్షాల నుంచి ఆరోపణలు వెల్లువెత్తడం, ప్రజల్లోనూ దీనిపై తీవ్ర వ్యతిరేకత వస్తుండటంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. ఈ అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి కూడా సీరియస్ అయినట్టు తెలిసింది. వెంటనే సన్నబియ్యం కొనుగోలు టెండర్లను రద్దు చేయాలని అదేశించినట్టు సమాచారం. దీంతో అధికారులు టెండర్లను రద్దు చేశారు. అందుబాటులో ఉన్న ధాన్యం అమ్మేసి, బియ్యం కొనుగోలు చేయాల్సిన అవసరం ఏమిటనే ప్రశ్నలు వినిపించాయి. దీంతోపాటు ధాన్యం టెండర్లలో పాల్గొని టెండర్ దక్కించుకున్న సంస్థలే బియ్యం టెండర్లలో పాల్గొనడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి.