28-05-2024 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి, మే 28: ఉత్తరాదిలో ఓటర్లను ప్రభావితం చేసేందుకు దక్షిణాదిలో ఎక్కువ సీట్లు వస్తాయని బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారన్నారని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. అమిత్ షా వ్యాఖ్యలు కూడా ఇదే ఉద్దేశంతో మాట్లాడి ఉండవచ్చన్నారు. రెండు రోజుల కిందట అమిత్ షా ఏపీలో పదిహేడు లోక్ సభ సీట్ల గెలవబోతున్నట్లుగా ప్రకటించారు. ఈ సంఖ్యపైనే అమిత్ షా స్పందించారు. ఈవీఎంల్లో ఫలితాలు నిక్షిప్తమయ్యాక ఊహగానాలతో లాభమేంటని సజ్జల ప్రశ్నించారు. మంగళవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో విూడియాతో మాట్లాడారు. మాచర్ల ఘటనలపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని సజ్జల ఆరోపించారు. పోలింగ్ కేంద్రంలోని పిన్నెల్లి వీడియో ఎలా బయటికి వచ్చిందో చెప్పాలన్నారు. టీడీపీ నేతలు ఈవీఎంలు ధ్వంసం చేసిన వీడియోలు ఎందుకు బయటకు రాలేదని... ఈవీఎంలు ధ్వంసం అయిన అన్నిచోట్ల వీడియోలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. మాచర్ల విషయంలో నిష్పక్షపాతంగా విచారణ జరగడం లేదన్నారు. బెట్టింగ్ ల కోసం, సోషల్ విూడియాలో ప్రచారం కోసం ప్రయత్నాలు చేయడం లేదన్నారు. అన్యాయం జరిగింది కాబట్టి రీ పోలింగ్ అడిగామని, టీడీపీ ఎందుకు రీ పోలింగ్ అడగలేదని సజ్జల ప్రశ్నించారు. మా కార్యకర్తలపై జరిగిన దాడులపై ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు.
ఎన్నికల కమిషన్ బాబు వైరస్‌తో ఇన్ఫెక్ట్ అయిందన్నారు. బాధితులకు పార్టీ తరపున అండగా నిలుస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆదుకుంటామన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేసేందుకే కేంద్రంలో ఉన్న పార్టీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నట్లుందన్నారు. పోస్టల్ బ్యాలెట్‌లో ఓట్లు తమకే పడ్డాయని టీడీపీ ప్రచారం చేసుకుంటోందని.. కానీ ఉద్యోగులంతా తమ వెనుకే ఉన్నారని సజ్జల అన్నారు. పోస్టల్ బ్యాలెట్ కు లేనిపోని నిబంధనలు అంటగడుతున్నారని సజ్జల మండిపడ్డారు. పోస్టల్ బ్యాలెట్ పై సీఈఓ నిబంధనలకు విరుద్ధంగా ఆదేశాలు ఇచ్చారన్నారు. బీజేపీతో చంద్రబాబు పొత్తు తర్వాత బాబుకి అనుకూలంగా ఈసీ వ్యవహరిస్తుందని ఆరోపించారు. సీఎస్‌ను తప్పించాలనే రెండు నెలలుగా ప్రయత్నం చేస్తున్నారని సజ్జల ఆరోపించారు. ఉగ్రవాది లాగా సిఎస్ పై దాడి చేస్తున్నారన్నారు.