28-05-2024 RJ
సినీ స్క్రీన్
గత సంవత్సరం ’శాకుంతలం’ అనే ఒక పౌరాణిక సినిమా తీసిన గుణశేఖర్ ఆ తరువాత మళ్ళీ ఇప్పుడు ఇంకొక సినిమా అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా పేరు ’యుఫోరియా’ అని పెట్టారు, చిత్రీకరణ త్వరలోనే ప్రారంభం అవుతుంది అని కూడా ప్రకటించారు. అయితే ఈ సినిమా గురించిన ఇంకెటువంటి వివరాలు చెప్పలేదు. దర్శకుడు గుణశేఖర్ అంటే మామూలుగా వైవిధ్యమైన సినిమాలు తీస్తారు అని ప్రతీతి. 2015లో ’రుద్రమదేవి’ అనే ఒక చారిత్రాత్మక సినిమా తీసిన గుణశేఖర్ చాలా కాలంపాటు ఎటువంటి సినిమాలు చెయ్యలేదు. సుమారు ఎనిమిదేళ్ల తరువాత ’శాకుంతలం’ అనే ఒక పౌరాణిక సినిమాతో గత సంవత్సరం ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సమంత ఇందులో ప్రధాన పాత్ర అయిన శకుంతలగా కనిపించగా, దేవ్ మోహన్ అనే మలయాళం నటుడు దుష్యంతుడుగా వేశారు.
దిల్ రాజు ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించారు, ఈ సినిమా ప్లాప్ తో చాలా నష్టపోయారు అని కూడా అంటారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయం పాలైంది. ఎంతటి పరాజయం అంటే, ఉదయం ఆట పడ్డాక, చాలా చోట్ల సాయంత్రానికి ఈ సినిమా చాలా సినిమా హాల్స్ లో తీసేసారు. అంతటి ఘోరంగా విఫలం అయింది ఈ సినిమా. ఇప్పుడు మళ్ళీ గుణశేఖర్ తన గుణ హ్యాండ్‌మేడ్ ఫిలిమ్స్ బ్యానర్ పై నీలిమ గుణ నిర్మాతగా ఈ ’యూఫోరియా’ అనే సినిమా ప్రకటించారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి అని ఆ ప్రకటనలో చెప్పారు. సినిమాలో నటించబోయే నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణులకు సంబంధించిన వివరాలను త్వరలోనే తెలియజేస్తామని మేకర్స్ ప్రకటించారు.