28-05-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, మే 28: హైదరాబాద్ బేగంపేటలోని ప్రజాభవన్‌కు బాంబు బెదిరింపు కాల్ కలకలం రేపింది. కాసేపట్లో ప్రజా భవన్ పేలిపోతుందంటూ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు మంగళవారం ఓ దుండగుడు ఫోన్ చేసి బెదిరించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు బాంబు స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. ప్రజాభవన్‌లో ఎక్కడా బాంబు దొరకకపోవడంతో అది ఫేక్ కాల్‌గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఫోన్ చేసిన వ్యక్తిని పట్టుకునేందుకు గాలింపు చేపట్టారు. చివరికి ఆ కాల్ ఆకతాయిల పనిగా గుర్తించారు.
ఫేక్ ఫోన్ కాల్‌పై మంత్రి సీతక్క స్పందించారు. తాము ప్రజలకు స్వేచ్ఛగా ప్రజాభవన్‌లోకి వచ్చే అవకాశం ఇస్తే ఇలాంటివి జరుగుతున్నాయన్నారు. ఎవరైనా రావొచ్చని తాము ప్రజాభవన్ గేట్లు ఓపెన్ చేసి పెడుతున్నామని అన్నారు. కొందరు కావాలనే ఇలాంటి కాల్స్ చేసినట్లు వెల్లడించారు. ప్రజలు తాము కష్టాలను చెప్పుకునేందుకు ప్రజాభవన్‌లోకి అందర్నీ అనుమతిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం చెకింగ్ జరుగుతోందని.. వాస్తవాలు తెలుస్తాయని సీతక్క వ్యాఖ్యానించారు.