28-05-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, మే 28: చిన్నారులను విక్రయిస్తున్న అంతర్‌రాష్ట్ర ముఠాను రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లి పోలీసులు అరెస్టు చేశారు. ముఠా నుంచి 16 మంది చిన్నారులను కాపాడారు. వీరిలో కొందరు ఇతర రాష్టాల్రకు చెందిన పిల్లలు ఉన్నట్టు గుర్తించారు. ఇటీవల మేడిపల్లిలో చిన్నారి విక్రయంతో ముఠా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నాలుగు రోజుల క్రితం పీర్జాదిగూడలో రూ.4.50లక్షలకు ఆర్‌ఎంపీ డాక్టర్ శోభారాణి శిశువును విక్రయించారు. ఆమెకు సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేయడంతో ముఠాగుట్టు రట్టయింది. మొత్తం 16 మంది చిన్నారులను ఈ ముఠా విక్రయించినట్టు నిర్ధరించారు. కేసు వివరాలను రాచకొండ సీపీ తరుణ్ జోషి మంగళవారం మీడియాకు వెల్లడిరచారు.
ఈ రాకెట్‌తో సంబంధం ఉన్న ఏజెంట్లు, సబ్ ఏజెంట్లు మొత్తం ఎనిమిది మందిని అరెస్టు చేశాం. ఇటీవల మేడిపల్లిలో శోభారాణి, సలీం, స్వప్నలను అరెస్టు చేశాం. వారిని అరెస్టు చేసిన సమయంలో ఇద్దరు చిన్నారులను రక్షించాం. సంతానం లేని వారికి పిల్లలను విక్రయిస్తున్నట్టు గుర్తించాం. ఢిల్లీ, పుణె నుంచి చిన్నారులను తీసుకొచ్చి అమ్ముతున్నట్టు దర్యాప్తులో తేలింది. ఢిల్లీ, పుణెలో ఉన్నవారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందం వెళ్లింది. తల్లిదండ్రుల నుంచి రూ.50వేలకు కొనుగోలు చేసి.. రూ.1.80 లక్షల నుంచి రూ.5.50 లక్షల వరకు చిన్నారులను విక్రయిస్తున్నారు‘ అని రాచకొండ సీపీ తెలిపారు.