28-05-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, మే 28: తెలంగాణ రాష్ట్ర గీతంగా ఎంపిక చేసిన జయ జయహే తెలంగాణ అనే గీతాన్ని ప్రభుత్వం అధికారికంగా రికార్డు చేయిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అయితే కీరవాణి మూలాలు ఆంధ్ర ప్రాంతానికి చెందినవి కావడంతో ఈ విషయం మీద ట్రోలింగ్ జరుగుతోంది. తెలంగాణ ఆత్మగౌరవంగా భావించే రాష్ట్ర గీతానికి ఒక ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి ఎలా మ్యూజిక్ ఇస్తారు అనే విషయం మీద సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకంగా వ్యవహరించిన వారు మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని ఖండిస్తున్నారు. అయితే ఇప్పటికే రికార్డింగ్ సెషన్స్ కూడా మొదలైనట్లుగా ప్రచారం జరుగుతున్న సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయం మీద స్పందించారు.
తెలంగాణ అంటేనే రాచరికానికి వ్యతిరేకం, రాచరిక ఆనవాళ్లకు ఇక్కడ చోటు లేదు అని అన్నారు. రాటాలు గుర్తొచ్చేలా చిహ్నం, గేయం రూపొందిస్తున్నాం అని అన్నారు. రాజముద్ర రూపకల్పన బాధ్యత ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్‌కు ఇచ్చామని, తెలంగాణ గేయానికి సంగీతం సమకూర్చడం సహా మొత్తం వ్యవహారాన్ని అందెశ్రీకే అప్పగించాం అని అన్నారు. కీరవాణి వ్యవహారంతో నాకు సంబంధం లేదు, ఎవరితో సంగీతం చేయించుకోవాలనేది అందెశ్రీ దే తుది నిర్ణయం అని రేవంత్ రెడ్డి అన్నారు. ఇక అందెశ్రీ ఫోన్ కాల్‌గా చెబుతున్న ఒక ఆడియో రికార్డ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో అందెశ్రీ కీరవానికి అవకాశం ఇచ్చిన వ్యవహారం మీద ఆయనను ఒక యువకుడు ప్రశ్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది. అయితే ఆ యువకుడికి తనదైన శైలిలో అందెశ్రీ సమాధానం కూడా ఇస్తున్నారు. మరి ఈ అంశం మీద అందెశ్రీ స్పందిస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది.