29-05-2024 RJ
తెలంగాణ
ఎన్నికల అంకం పూర్తి కావస్తున్న తరుణంలో ప్రజల సమస్యలను ప్రస్తావించి పరిస్కరించే దిశగా అన్ని పార్టీలు ఆలోచించాలి. ఓ రెండేళ్లపాటు రాజకీయాలను పక్కన పెట్టి వళ్లు వంచి పనిచేయాలి. అన్ని పార్టీలు ఇది అలవాటు చేసుకోవాలి. అప్పుడే దేశానికి మేలు చేసినవారు అవుతారు. అలాకాకుండా ఇంకా తమ రాజకీయాలను ప్రయోగిస్తూ పోతే ప్రజలు కూడా సమయం కోసం వేచిచూస్తారు. ముఖ్యంగా అధికారంలో ఉన్న బిజెపి, అధికారంలోకి రావాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీలు ప్రజల సమస్యలే ఎజెండాగా పనిచేయాలి. ఈ క్రమంలో ఎవరు ఏ పార్టీలోకి మారినా ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదు. ప్రజలు కేవలం పాలనా తీరును మాత్రమే చూస్తున్నారు. తాయిలాలకు కూడా లొంగడం లేదు.తాయిలాలు ఇచ్చి..అభివృద్దిని పక్కన పెట్టిన నేతలను దూరం పెడుతున్నారు. అలాగే ప్రజల సమస్యలు, ధరలు, పన్నులు తదితర అంశాలు కూడా ఎన్నికల్లో ప్రధాన ప్రచారంగా మారాయి. పరస్పర విమర్శలు ఎన్ని చేసుకున్నా..ప్రజల్లో ఉన్న ఆలోచనలకు అనుగుణంగానే ఓట్లు పడివుంటాయి.
జూన్1తో ఏడోదశ పోలింగ్ ముగుస్తుంది. అనంతరం 4న ఓట్ల లెక్కింపు జరిగి..మధ్యాహ్నానికి ఎవరు విజేతలో తేలనుంది. అయితే ప్రధానంగా అధికార బిజెపి ఎక్కడా తన ప్రచారంలో పెరుగుతున్న ధరలు,నిరుద్యోగం వంటి సమస్యలను ప్రసతావించలేదు. రాముడిని సెంటిమెంటుగా వాడుకుంది. పాక్‌ను వాడుకుంది. పుస్తెమట్టెలను వాడుకుంది. కాంగ్రెస కూటమి బలహీనతలను ప్రచారంలో పెద్దవిగా చేసి చూపింది. కాంగ్రెస్ మాత్రం నిరుద్యోగం, ధరలు, రాజ్యాంగం, ఆదానీ అంబానీలకు దేశ సంపద దోచిపెట్టడం వంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావించింది. అయితే ఈ అంశాల ప్రభావం ఎలా ఉందన్నది ఇప్పుడే చెప్పలేం. అందుకే రాజకీయ నేతలు అటుఇటుగా మారినా ప్రజలు పట్టించుకోలేదు. పరస్పరం తిట్టిపోసుకున్నా పట్టించుకోలేదరే చెప్పాలి. అలాగే ప్రధానంగా ప్రజల సమస్యలను ఏ పార్టీ కూడా పెద్దగా ప్రచారం చేయలేదు. అందుకే రాజకీయాల్లో బంధాలు శాశ్వతంగా నిలబడడం లేదు.. అటువారు ఇటు ఇటువారు అటు మారుతున్నారు. అధికారం ఉన్న పార్టీల్లోకి వలసలు పెరిగాయి. ఎవరిపై రాజకీయ ప్రేమలు శాశ్వతంగా ఉండవని మాత్రం గుర్తించాలి.
ఇక తెలంగాణను తీసుకుంటే ..కాంగ్రెస్‌కు అధికారం రావడంతో పలువురు అధికార పార్టీలో చేరుతున్నారు. ఓట్లు కొల్లగొట్టేందుకు ఎవరు పార్టీలు మారినా పట్టించుకోలేదు. ఎన్నికలను చూస్తుంటే ప్రజలపట్ల అన్ని పార్టీలు ప్రేమలు ఒలకబోస్తున్నాయి. ఎన్నికల ముందున్న ప్రేమలు ఎన్నికలయ్యాక నిలబడడం లేదు. కులాల వారీగా రాజకీయ ప్రేమలను ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణలో కాంగ్రెస్ మెల్లగా పైచేయి సాధిస్తోంది. అధికారంలో ఉండగా బిఆర్‌ఎస్ ఇలాగే వ్యవహరించింది. ప్రజలను పట్టించుకోలేదు. కేవలం కుటుంబ సంక్షేమమే పాలనగా చూసింది. ఇప్పుడు గగ్గోలు పెట్టినా ఆ పార్టీ గురించి ప్రజలు పట్టించు కోవడం లేదు. ఆదిలాబాద్‌లో పత్తిరైతులపై లాఠీఛార్జిని ఖండిరచిన బిఆర్‌ఎస్ నేతలు..గతంలో అసలు నడ్డీనే విరిచారు. మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్‌ల పేరుతో రైతుల ఉసురు తీసారు. భూములను గుంజుకున్నారు. లాఠీ ఛార్జీలు చేశారు. కోర్టుల చుట్టూ తిప్పారు జైళ్లలో పడేశారు.
ఖమ్మం జిల్లాలో కాల్పులు జరిపారు. మద్దతు ధరలు ఇవ్వలేదు. సకాలంలో గింజలు కొనలేదు. ఇవన్నీ మరచిన బిఆర్‌ఎస్ నేతలు చిలకపలుకులు పలుకుతున్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం ప్రజలపై కపటప్రేమను ఒలకబోసారు. ఇవన్నీ అనుభవించిన ప్రజలు బిఆర్‌ఎస్ అనే పార్టీని, కెసిఆర్ అనే నాయకుడిని ఇంకా నమ్ముతారని అనుకుంటే పొరపాటే. అలాగే తెలంగాణ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ మెల్లగా సైడ్ ట్రాక్ పడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. బిఆర్‌ఎస్ బాటలోనే బిజెపి కూడా విమర్శలు చేస్తోంది. అంతే తప్ప న ఇర్మానాత్మక సహకారం ఇవ్వడం లేదు. విపక్షం అంటే విమర్శించడమే ఇక్కడి బిజెపి నేతలు నేర్చుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అన్ని అస్త్రాలను ప్రయోగించింది. తెలంగాణ అంటే కెసిఆర్..కెసిఆర్ అంటే తెలంగాణ అని బిల్డప్ ఇచ్చారు. అందుకే బిఆర్‌ఎస్, బిజెపిలకు గట్టి కౌంటర్ ఇచ్చేందుకు అధికార పార్టీ అదే దూకుడు ప్రయోగిస్తోంది.
కృష్ణా ప్రాజెక్టులు, కాళేశ్వరం విషయంలో బీజేపీ తన వాదనను సమర్థంగా వినిపించడం లేదు. కేంద్రం నుంచి అందాల్సిన సాయం అందించడం లేదు. బిజెపి విమర్వల వెనక రాజకీయం ఉందా..రాష్ట్ర ప్రయోజనాలు ఉన్నాయా అన్నది ప్రజలు బాగా ఆలోచిస్తూనే ఉంటారు. కృష్ణా ప్రాజెక్టులు అప్పగించడం లేదా కేంద్రం ఆధీనంలో ఉంచుకోవడం విషయంలో బిజెపి ఆడుతున్న రాజకీయాలు అంతాఇంతా కాదు. ఇక్కడున్న బిజెపి నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్‌లకు రాజకీయం తప్ప తెలంగాణ ప్రయోజనాలు పట్టడం లేదు. వివిధ సమస్యలపై దాటవేత ధోరణి ప్రదర్శించిన బీజేపీకి పార్లమెంట్ ఎన్నికలకు ముందు తీర్చలేని సమస్యగా మారిందని గుర్తించలేక పోయారు. ఇకపోతే బిజెపి నేలవిడిచి సాము చేస్తోంది. బిఆర్‌ఎస్ అలా చేసే చతికిల పడిరది. కాంగ్రెస్ ముక్త భారత్ అన్న నినాదం తరవాత కాంగ్రెస్ బాగానే పుంజుకుంది. కర్నాటక, తెలంగాణల్లో అధికారం సాధించింది.
కాంగ్రెస్ ముక్త భారత్ అన్నది ప్రజల్లోంచిరావాలి. ప్రజలు మూకుమ్మడిగా బిజెపి మాత్రమే దేశానికి అవసరమని గుర్తించాలి. అలా జరగనప్పుడు బీజేపీ కలలు కంటున్న కాంగ్రెస్ ముక్త భారత్ సాధ్యం కాకపోవచ్చు. గత పదేళ్ల బీజేపీ నిర్వాకంలో ఏ రంగం ఎంత అధ్వాన్నస్థితిలో ఉన్నదో మోడీ ద్వయం కావచ్చు..రాష్టాల్ల్రో ఉన్న నేతలు కావచ్చు..ఆత్మపరిశీలన చేసుకోవాలి. ప్రజల ఆకాంక్షల ను నెరవేర్చామా లేదా అన్నది చెప్నాలి. ప్రత్యక్షంగా అనుభవిస్తున్న ధరల పెరుగుదల, నిరుద్యోగ సమస్యలను రాష్టాల్ర నాయకులు కేంద్రం దృష్టికి తీసుకుని వెళ్లాలి. మరోమారు అధికారంలోకి వస్తే ఈ సమస్యలను పరిష్కరించాలని సూచించాలి. ఎదురుపడి మాట్లాడే ధైర్యం లేకుంటా వినతిపత్రం రూపంలో అందచేయాలి. అలా చేయలేని నాడు నేతలుగా ఉండడం తగదు.