29-05-2024 RJ
ఆంధ్రప్రదేశ్
శ్రీకాకుళం, మే 29: సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్ళు అనే సిద్దాంతంతో టీడీపీ పనిచేస్తుందని టిడిపి ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. టిడిపి వచ్చిన తరవాతనే బడుగు,బలహీన వర్గాలకు రాజకీయ అవకాశాలు దక్కాయన్నారు. విూడియాతో మాట్లాడుతూ జగన్‌పై ప్రజలకు మోజు తగ్గిందని, ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఓట్ల రూపంలో నమోదు అయ్యిందని అన్నారు. ప్రజలు టీడీపీ వైపు చూస్తున్నారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని అన్నారు. నవరత్నాలు సైతం సరిగ్గా అమలు చేయలేదని విమర్శించారు. సకాలంలో పెన్షన్లు సక్రమంగా అందించలేదని అన్నారు. అందుకే ఈ ఎన్నికల్లో టిడిపి కూటమి ఘన విజయం సాధించబోతోందని అన్నారు. పేదవాడు దౌర్భాగ్య పరిస్థితి అనుభవిస్తున్నాడని తెలిపారు. గ్రామ సచివాలయాలు సక్రమంగా పనిచేయలేదని, ప్రజలు తమ సమస్యలపై టీడీపీని ఆశ్రయిస్తున్నట్లు చెప్పారు. హోదాపై ఐదేల్లుగా జగన్ ఎందుకు మాట్లాడలేక యారని నిలదీశారు.
జగన్ పులకేసి రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. జగన్ సర్కార్ అరాచక పాలనతో రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు నాశనమయ్యాయని ఎంపి అన్నారు. వైసీపీ ప్రభుత్వ అరాచకాలను ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్లామని అన్నారు. సార్వ త్రిక ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించి సీఎంగా చంద్రబాబును చేసేందుకు కార్యకర్తలు, నేతలు సైనికుల్లా పనిచేశారని అన్నారు. వైసీపీ ప్రభుత్వానిది నిరంకుశ పాలన అని టీడీపీ నేత విమర్శించారు. ప్రభుత్వ తప్పులను ప్రశ్నించే వారిని బెదిరించడం, కేసులు పెట్టి వేధించడం జగన్ పాలనలో పరిపాటిగా మారిందన్నారు. వైసీపీ పాలనపై అన్నివర్గాల ప్రజలు విసిగి వేసారిపోయారన్నారు. కౌంటింగ్‌కు కూడా భారీగా భద్రత ఏర్పాటుచేయాల్సిన దుస్థితిని తీసుకుని వచ్చారని అన్నారు. టీడీపీ పథకాలకు పేర్లు మార్చి కొందరికి మాత్రమే ఇస్తున్నారని విమర్శించారు. ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని తేలిందని అన్నారు. విద్యుత్ కోతలతో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రామ్మోహన్ నాయుడు అన్నారు.