29-05-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, మే 29: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన హైదరాబాద్ సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావును పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. ఉమామహేశ్వరరావుని ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నారు. ఉమామహేశ్వరరావును ముగ్గురు అధికారుల బృందం విచారణ చేస్తోంది. ఉమామహేశ్వరరావు భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు గుర్తించారు. బినావిూ ఆస్తులపై కూడా ఏసీబీ విచారణ చేస్తోంది. రెండు బ్యాంక్ లాకర్లను ఏసీబీ అధికారులు ఓపెన్ చేయనున్నారు. ఏసీబీ విచారణలో మరి కొంత మంది బినావిూలు వ్యవహారం బయట పడే అవకాశం ఉంది. ఇబ్రహీంపట్నంలో ఏసీపీగా పని చేసిన సమయంలో జరిగిన అక్రమాలపై లోతుగా విచారణ నిర్వహిస్తున్నారు.
అక్రమాస్తుల వివరాలను వెలికి తీసేందుకు ఏసీపీని తమ కస్టడీకి అప్పగించాలంటూ అధికారులు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు సానుకూలంగా స్పందించి.. మూడు రోజుల పాటు కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఏసీపీ ఉమామహేశ్వరరావు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఈ నెల 22న ఆయన నివాసంలో అధికారులు సోదాలు చేసి రూ.3.95 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించారు. ఆ వెంటనే ఏసీపీని అదుపులోకి తీసుకున్నారు. నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టగా.. ఉమా మహేశ్వరరావుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. చంచల్‌గూడ జైలులో ఉన్న ఆయనను నేడు అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు.