29-05-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, మే 29: మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు.ఈసారి ఓ ఇంటి వివాదంపై పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు. హైదరాబాద్‌లో ఉన్న తన ఇంటిని ఓ ఫ్యామిలీ ఖాళీ చేయకపోగా... తన సంతకాలు ఫోర్జరీ చేసిందని ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్ రోడ్డు నెంబర్ 62లో జేసీ దివాకర్ రెడ్డికి ఓ ఇల్లు ఉంది. దీన్ని సాహితీ లక్ష్మీనారాయణ అనే ఫ్యామిలీకి అద్దెకు ఇచ్చారు. ఇప్పుడు వివాదానికి కేంద్రం బిందువు ఈ ఇల్లే. అద్దెకు ఇల్లు ఇచ్చినప్పుడు మూడేళ్లకు ఒప్పందం చేసుకున్నారు. మూడేళ్ల పాటు ఎలాంటి సమస్య రాలేదు. మూడేళ్ల గడవు తీరిపోయి ఏడాది దాటింది. అంటే 2023 మేలోనే ఒప్పందం గడువు ముగిసింది. అప్పటి నుంచి ఇల్లు ఖాళీ చేయాలని సాహితీ లక్ష్మీనారాయణ ఫ్యామిలీని జేసీ దివాకర్ రెడ్డి చెబుతూ వస్తున్నారు. ఎన్నిసార్లు చెప్పినా వాళ్లు పట్టించుకోలేదు. అద్దె ఒప్పంద గడువు ముగిసినా తన ఇల్లు ఖాళీ చేసి ఇవ్వడం లేదని జేసీ దివాకర్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. ఇక్కడ కేసు మరో మలుపు తిరిగింది.
కోర్టుకు జేసీ దివాకర్ రెడ్డి పేరుతో ఉన్న ఒప్పందం కోర్టు సమర్పంచినట్టు నోటీసులు వచ్చాయి. గడువు తీరక ముందే ఖాళీ చేయించడం సరికాదని సమాధానం చెప్పాలని అందులో ఉంది. అది చూసి షాక్ తిన్న జేసీ దివాకర్ రెడ్డి ఆ డాక్యుమెంట్స్‌ను ఒకటి పదిసార్లు చెక్ చేశారు. అప్పుడుగానీ అర్థం కాలేదు అది తప్పుడు డాక్యుమెంట్ అని. బూదాటి లక్ష్మీనారాయణ, అతని కుమారుడు సాత్విక్ తన సంతకాన్ని ఫోర్జరీ చేసి సివిల్ కోర్టులో పిటిషన్ వేసినట్టు గుర్తించారు. అందులో తేదీ కూడా 2021 నాటిదిగా గమనించారు. దీని ఆధారంగానే కోర్టు నోటీసులు పంపించిందని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. ఒప్పందం ప్రకారం గడువు ముగిసేలోపు ఇల్లు ఖాళీ చేసి ఇవ్వకపోవడం ఒక తప్పు అయితే... తన సంతకాలను ఫోర్జరీ చేయడం నేరమని జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. జేసీ దివాకర్ రెడ్డి ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. సోమవారం కేసు రిజిస్టర్ అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందీ వివాదం. లక్ష్మీనారాయణ, సాత్విక్‌తోపాటు వాళ్ల లాయర్ మహమ్మద్ షాజుద్దీన్ తప్పుడు సమచారంతో కోర్టును కూడా మోసగించారని తన ఫిర్యాదులో జేసీ దివాకర్ రెడ్డి పేర్కొన్నారు.