29-05-2024 RJ
ఆంధ్రప్రదేశ్
బాపట్ల, మే 29: జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బాపట్ల - గుంటూరు రోడ్ లోని నాగరాజు కాల్వలో ఈతకు వెళ్లిన నలుగురు యువకులు గల్లంతు అయ్యారు. అయితే, గల్లంతైన యువకులు హైదరాబాద్ నగరంలోని కూకట్ పల్లికి చెందిన వాసులుగా గుర్తించారు. బాపట్లలోని సూర్యలంక తీరానికి విహార యాత్రకు వచ్చి సవిూపంలోని కాలువలో ఈతకు దిగి యువకులు కొట్టుకుపోయారు. విషయం తెలుసుకున్న అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వారి పేర్లు సన్నీ, సునీల్, కిరణ్, నందు అని గుర్తించారు. మొత్తం నలుగురు గల్లంతు కాగా, అందులో 10 సంవత్సరాల బాలుడితో పాటు ముగ్గురు యువకులు ఉన్నారు.
ఈ ఘటనపై పోలీసులు మృతుల కుటుంబాలకు సమాచారం అందించారు. నలుగురు మృతదేహాల కోసం గజ ఈతగాళ్లతో వెతికిస్తున్నారు. దీంతో కాల్వ దగ్గర భారీగా ప్రజలు గుమిగూడటంతో పోలీసులు వారిని అదుపు చేస్తున్నారు. కాగా, సంఘటన ప్రదేశంలో మృతుల కుటుంబీకుల రోధనలతో మర్మోగిపోతుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.