29-05-2024 RJ
తెలంగాణ
ఖమ్మం, మే 29: రఘునాథపాలెం మండలం హర్యాతండాలో నిన్న జరిగిన కారు ప్రమాద ఘటనపై మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. భర్తే హత్య చేసి రోడ్డుప్రమాదంగా చిత్రీకరిస్తున్నాడని ఆరోపిస్తూ మృతురాలు కుమారి కుటుంబ సభ్యులు ఖమ్మం జిల్లా ప్రభుత్వాసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ప్రమాదంలో తల్లి, ఇద్దరు చిన్నారులు మృతిచెందారని, కానీ పిల్లల శరీరంపై చిన్న గాయం కూడా లేదన్నారు. ఇంత పెద్ద ప్రమాదం జరిగితే చిన్నగాయమూ అవ్వద్దా అంటూ ప్రశ్నిస్తున్నారు. భర్త ప్రవీణ్ వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని పక్కా ప్లాన్ ప్రకారమే భార్య, ఇద్దరు పిల్లల్ని చంపేసి ప్రమాదంగా చిత్రీకరించాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
హర్యాతండా వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు చిన్నారులు కృషిక(5), క్రితన్య(2)తో సహా తల్లి కుమారి(25) అక్కడికక్కడే మరణించిన విషయం తెలిసిందే. భర్త స్వల్పగాయాలతో ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రవీణ్.. హైదరాబాద్‌లో ఓ ప్రవేట్ ఆసుపత్రిలో వైద్యుడిగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే బాధితుడి వాదన మరోలా ఉంది. కుక్క అడ్డురావడంతో తప్పించబోయి చెట్టును ఢీకొట్టినట్లు భర్త ప్రవీణ్ చెప్తున్నారు.