29-05-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, మే 29: తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు మరోసారి టెర్రరిస్టుల నుంచి బెదిరింపులు వచ్చాయి. పాకిస్తాన్ నెంబర్ల నుంచి పదేపదే బెదిరింపులు రావడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. అన్ని నెంబర్లు పాకిస్తాన్ నుంచి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఓ ఫోన్ నెంబర్‌కు టెర్రరిస్టు ఫోటో కూడా ఉంది. రాజాసింగ్‌కు బెదిరింపులు రావడం ఇదే మొదటిసారి కాదు. ఇప్పటికే అనేక సార్లు వచ్చాయి. రాజాసింగ్‌కు .. ఉగ్రవాదుల నుంచి తరచూ బెదిరింపులు వస్తూంటాయి. గతంలో కూడా ఇలా బెదిరింపులు రావడంతో పోలీసులు ఆరా తీశారు. పాతబస్తీకి చెందిన ఓ యువకుడు గల్ఫ్ దేశాల్లో ఉపాది పొందుతూ అక్కడ నుంచి రాజాసింగ్ కు బెదిరింపు కాల్స్ చేశారని గుర్తించారు. రాజాసింగ్‌కు టెర్రరిస్టుల నుంచి ముప్పు ఉండటంతో గతంలో భద్రత కల్పించారు. ఎమ్మెల్యేగా ఆయనకు భద్రత ఉంటుంది. అయితే ఆయనకు ఉన్న ముప్పు కారణంగా ఇంకా ఎక్కువ భద్రత కల్పించాలని కోరుకుంటున్నారు. కానీ పోలీసులు మాత్రం పెద్దగా పట్టించుకోవం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పోలీసులు తనకు ఓ పాత వాహనాన్ని కేటాయించారని.. అది ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతుందని.. రాజాసింగ్ చెబుతూ ఉంటారు. ఆ వాహనం వల్ల రోడ్డుపై చతాలా సార్లు నిలిచిపోయి .. నడుచుకుంటూ పోవాల్సి వచ్చిందని కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ రాజాసింగ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. తనకు వచ్చిన బెదిరింపు కాల్స్ నెంబర్లను ఆయన ట్విట్ చేశారు. బెదిరింపు కాల్స్ తనకు కొత్త కాదని.. గతంలో ఎన్నో ఫిర్యాదులు చేసినా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. ఒక బాధ్యతగల పౌరుడిగా తనకు వస్తున్న బెదిరింపు కాల్స్ గురించి పోలీసుల దృష్టికి తీసుకెళ్తున్నట్లు తెలిపారు. తాజాగా ఏయే నెంబర్ల నుంచి తనకు ఫోన్లు వస్తున్నాయనే విషయాన్ని రాజాసింగ్ తెలిపారు. బెదిరింపు కాల్స్‌పై ఎన్ని ఫిర్యాదులు ఇచ్చినా ఫలితం లేదని రాజాసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా బెదిరింపు కాల్స్‌పై చర్యలు తీసుకుంటారా.. లేదా అనేది చూడాలన్నారు.
ఈరోజు తనకు వరుసగా బెదిరింపు కాల్స్ వచ్చాయని.. పాలస్తీనాకు చెందిన వ్యక్తిగా తెలుస్తోందని రాజాసింగ్ వెల్లడిరచారు. ధర్మం కోసం నువ్వు పనిచేస్తే చంపేస్తామని బెదిరిస్తున్నారని తెలిపారు. తన ఫ్యామిలీని కూడా చంపేస్తామని బెదిరించారన్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఇలాంటివి ఎన్నో కాల్స్ వచ్చాయన్నారు. వాటిపై.. ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నారని.. ఆయన ప్రభుత్వం వీటిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచిచూడాలన్నారు.