29-05-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, మే 29: తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు దగ్గర పడుతున్న వేళ ఉత్సవాల నిర్వహణపై ప్రభుత్వం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. అలాగే ఉత్సవాలకు ప్రత్యేక అతిథిగా సోనియాను సిఎం రేవంత్ ఆహ్వానించారు. మరోవైపు ముద్రను మార్చాలన్న నిర్ణయంతో పాటు, జజాతీయ గీతం కూడా రూపుదిద్దు కుంటోంది. ఈ క్రమంలో పనులు వేగవంతం చేశారు. తెలంగాణ గీతం, రాజముద్ర ఎంపికపై సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలో.. ముఖ్యమంత్రి నివాసానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరయ్యారు. తెలంగాణా గీతం, తెలంగాణ లోగో ఎంపిక పై వారిద్దరూ చర్చించారు. మరోవైపు.. తెలంగాణ రాష్ట్ర గీతం రూపకల్పన తుది దశకు చేరుకుంది. ఈ క్రమంలో.. గీతం రూపకల్పనపై కవి అందెశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణితో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ సవిూక్ష చేపట్టారు. సాయంత్రం వరకు పాటకు సంబంధించి పూర్తిస్థాయిలో కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు.. తెలంగాణ రాజముద్రకు సంబంధించి ఒకట్రెండు రోజుల్లో అధికారికంగా స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా లోగో, గీతాన్ని ప్రభుత్వం అధికారికంగా విడుదల చేయనుంది. రాజముద్రకు సంబంధించి గతంలో ఉన్న రంగులే ఉండనున్నాయి. కాకపోతే.. గతంలో ఉన్న రాజముద్రకు సంబంధించి అందులో రాచరిక పోకడలు ఉన్నాయని.. తెలంగాణ అనేది ఉద్యమం, సామాజిక, ఆర్ధిక, సాంస్కృతిక అంశాలను పొందుపరిచేలా రాజముద్ర ఉంటే బాగుటుందనే ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. అందుకు అనుగుణంగా చిహ్నాలను పొందుపరిచే అవకాశం ఉంది. కాగా.. రాష్ట్ర గీతాన్ని రూపొందించేందుకు అందెశ్రీకి బాధ్యతలు అప్పగించగా.. మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణితో కలిసి జయ జయహే తెలంగాణ పాటను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం, రఘు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, రాంచంద్రు నాయక్, గండ్ర సత్యనారాయణ, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే సంపత్, ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్, తదితరులు హాజరయ్యారు.