29-05-2024 RJ
ఆంధ్రప్రదేశ్
తిరుపతి, మే 29: శ్రీనివాసమంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన వసంతోత్సవాలు బుధవారం ఘనంగా ముగిశాయి. చివరి రోజు స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు. భూ సమేత వేంకటేశ్వరస్వామి, సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి, రుక్మిణి, సత్యభామ సమేత శ్రీకృష్ణుని ఉత్సవమూర్తులను వసంత మండపంలోకి వేంచేపు చేసి ఆస్థానం నిర్వహించారు. మధ్యాహ్నం ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు.
ఈ సందర్భంగా పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలసూక్తం, విష్ణుసూక్తం, దశ శాంతి మంత్రములు, తైత్తరీయ ఉపనిషత్తు, దివ్య ప్రభందములో అభిషేక సమయంలో అనుసంధానము చేసే నిరాట్టమ పాశురాలను అర్చకులు పఠించారు. ఈ వేడుకలో ఒకో క్రతువులో ఒక మాల వంతున మొత్తం ఏడు రకాల మాలలను స్వామి, అమ్మవార్లకు అలంకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మీ, ఏఈవో గోపినాథ్, సూపరింటెండెంట్ చెంగల్రాయులు, భక్తులు పాల్గొన్నారు.