29-05-2024 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి, మే 29: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సామాజిక భద్రత పింఛన్ల కోసం నిధులు విడుదల చేసింది. రాష్ట్రంలోని 68,30,808 మందికి రూ. 1939.35 కోట్లను విడుదల చేసింది. జూన్ 1న 47,74,733 మంది బ్యాంకు ఖాతాలకు పింఛన్లు జమ అవుతాయని స్పష్టం చేసింది. మిగతా లబ్దిదారులకు జూన్ 1 నుంచి 5వ తేదీ మధ్య ఇంటింటికి పింఛన్లు పంపిణీ చేస్తారని వివరించింది. రాష్ట్రంలో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పింఛన్ల పంపిణీ వివాదస్పదంగా మారింది. ఎన్నికల షెడ్యూల్ విడుదల నాటి నుంచి ఏపీలోని అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య పింఛన్ల పంపిణీపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసుకున్నారు. ఎన్నికల్లో లబ్దిపొందేందుకు అధికార వైసీపీ వలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీని అడ్డుకోవాలని టీడీపీ ఫిర్యాదు చేయడంతో ఏప్రిల్ నెల పింఛన్ల పంపిణీ ఆలస్యం జరిగింది.
పింఛన్‌దారులు గ్రామ పంచాయతీ కార్యాలయానికి వచ్చి పింఛన్‌ను తీసుకెళ్లే పక్రియను ప్రారంభించారు. పంచాయతీ కార్యాలయానికి రాలేని వృద్ధులు అనేక మంది ఇబ్బందులు పడ్డారు. ఒకరిద్దరు వృద్ధులు వడదెబ్బ తగిలి ప్రాణాలు కోల్పోయ్యారు. ఎన్నికలు ముగియడంతో మే నెలకు చెందిన పింఛన్ డబ్బును పంపిణీకి ఏర్పాట్లు చేసింది. పింఛన్ల పంపిణీలో ఎన్నికల నియమావళి పాటించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇంటింటికి వెళ్లి ఎవరూ పంపిణీ చేస్తారో ప్రభుత్వం స్పష్టం చేయకపోవడం గందరగోళ పరిస్థితికి దారితీస్తోంది .