30-05-2024 RJ
తెలంగాణ
వరంగల్, మే 30: ఆదివాసీలకు ప్రత్యేక రాజ్యాంగ హక్కులు ఉంటాయన్న సంగతి కానరావడంలేదని ఆదివాసి హక్కుల పోరాటసమితి, తుడుందెబ్బ తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపక ప్రధానకార్యదర్శి సిద్దబోయిన లక్ష్మినారాయణ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన నాటినుండి పాలనలోనికి వచ్చిన పాలకులు ఆదివాసీలను,వారి నివాస ప్రాంతాలను, వారి రాజ్యాంగ హక్కులను పరిగణంలోనికి తీసుకోలేదని ఆయన ఆరోపించాడు. తెలంగాణ రాష్ట్రంలోని 10 జిల్లాలను ఆశాస్త్రీయంగా 33 జిల్లాలుగా ఏర్పాటు చేసేక్రమంలో ఆదివాసీలను నివాస ప్రాంతాలను ముక్కుచెక్కలు చేసిన క్రమాన్ని ఆదివాసీలు తప్పుపట్టి మాప్రాంతాలను ఒకే జిల్లాలుగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలను పెట్టారు. పాలకులు ఆదివాసీల ప్రతిపాదనలను ప్రక్కకు నెట్టి జిల్లాలను ఏర్పాటు చేశారు. ఆ జిల్లాల ఏర్పాటుతో ఐటీడీఏల ద్వారా అభివృద్ధి జరగాల్సిన ఆదివాసీల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందన్నారు. జీవో.ఎంఎస్ నెం.57 ఐటీడీఏల 5వ షెడ్యూల్డ్ ప్రాంతాల పాలన, అభివృద్ధి, ఆదివాసుల వికాసం,పురోభివృద్ధి, కాలనుగుణంగా మారుతున్న ధృక్పధాలకు అనుగుణంగా ఆదివాసీల పరిస్థితిని అంచనావేసి ప్రణాళికలు తయారు చేసే ఐటీడీఏల పాత్ర నామమాత్రంగా మారిపోయిందన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన 33జిల్లాలను నూతన జోనల్ వ్యవస్థను ఆదివాసీ ప్రాంతాలను కలుపుతూ ఏర్పాటు చేశారు. ఈ జోనల్ వ్యవస్థ ముసాయిదాను రూపొందించే క్రమంలో ఆదివాసీల నివాస ప్రాంతాలను,ప్రత్యేక హక్కులను రాజ్యాంగ రూపకర్తలుప్రతి పాదించి రాజ్యాంగంలో పొందపరిచారన్న సంగతిని మరచిపోయినారన్నారు. ఆదివాసీల ప్రత్యేక స్థితి గతులను పరిగణలోనికి తీసుకోవలన్న సంగతిని మరచిపోయి,సాధారణంగా మైదాన ప్రాంతాలను వర్తించే అంశాలను రూపొందించి, 2018 రాష్ట్రపతి జోనల్ ఉత్తర్వులను పొందింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈ ఉత్తర్వులను అమలు చేయుటకుగాను, జీవో.317ని రూపొందించి నిర్దాక్ష్యణంగా అమలు చేసి, ఆదివాసీల రాజ్యాంగ పరిమితులను చెదరగొట్టిందన్నారు. ఆదివాసీ నిరుద్యోగులకు ప్రత్యేకంగా జారీ చేసిన ఉద్యోగ కల్పన జీవోలను కనుమరుగు చేసిందన్నారు. ఆదివాసీల హక్కులపై, ప్రాంతాలపై, ప్రాంతాల స్థితిగదులపై ఆదివాసీల పక్షాన రాజకీయ రిజర్వేషన్లతో ఎన్నుకోబడిన ఆదివాసీ రాజకీయ నాయకులు దృష్టిపెట్టడంలేదన్నాడు.ఇప్పటికైన పాలనలోనికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభత్వం ఆదివాసీల కోసం ఆలోచన చేయాలని లక్ష్మినారాయణ కోరారు.