30-05-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, మే 30: తెలంగాణ కొత్త లోగో అంటే అధికారిక రాజముద్ర ఖరారు అయ్యిందని, దానిని దశమ వార్షికోత్సవంలో విడుదల చేయాలని భావించిన కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. దీనిని ప్రస్తుతానికి వాయిదా వేయాలని సిఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. దీనిపై పూర్తిగా చర్చించి, తుదిరూపు ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. హడావిడి నిర్ణయం తీసుకోరాదన్న ఆలోచనలో ఉన్నారు. లోగో దాదాపు ఖరారయ్యిందని గత 24 గంటలుగా హడావుడి జరిగింది. వరుసగా సిఎం రేవంత్ సమావేశాలు పెట్టి చర్చించారు. అదిగో ఇదిగో రిలీజ్ అంటూ కాంగ్రెస్ నేతల ప్రచార మడావిడి కనిపించింది. ఇక సోషల్ విూడియాలో అయితే ఇదిగో ఇదే ఫైనల్ లోగో అని ఫొటోలు తెగ వైరల్ అయ్యాయి. అయితే.. తెలంగాణ కొత్త రాజముద్ర ఆవిష్కరణ వాయిదా పడిరది. తొలుత జూన్` 2 విడుదల చేయాలని భావించిన కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
జూన్ 2న కాకుండా మరో రోజున ఈ కార్యక్రమం చేపట్టాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. దీనిపై ఉన్నతాధికారులు సీఎం రేవంత్ రెడ్డితో సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే.. తెలంగాణ గీతం మాత్రమే జూన్ 2నే యధావిధిగా విడుదల చేస్తారని తెలుస్తోంది. అయితే ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, తెలంగాణ ప్రజల్లో ఓ వర్గం నుంచి వస్తున్న వ్యతిరేకతతో ప్రభుత్వం పునరాలోచనలో పడిరదనే వాదన కూడా గట్టిగానే నడుస్తోంది. కొత్త లోగోలో కాకతీయ తోరణం, చార్మినార్ స్థానంలో అమరవీరుల స్థూపానికి రేవంత్ రెడ్డి సర్కార్ అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలైన మూడు సింహాల లోగోను పైభాగంలో పొందుపరిచినట్లు కొన్ని చిత్రాలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. ఈ లోగోనే రేవంత్ ప్రభుత్వం దాదాపు ఖరారు చేసిందని వార్తలు వచ్చాయి. మొత్తం 40కిపైగా డిజైన్లను ప్రభుత్వం పరిశీలించగా.. ఒక్కటి మాత్రం ఖరారు చేసిందని టాక్.
మరో రెండు రోజుల్లో అవతరణ ఉత్సవాల నేపథ్యంలో రిలీజ్ చేయాలని నిర్ణయించినప్పటికీ వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించడం జరిగింది. పలు రకాల లోగోలు డిజైన్ చేయగా.. రాజముద్రలో మూడు సింహాల జాతీయ చిహ్నం, వ్యవసాయం, తెలంగాణ అమరవీరుల స్తూపం, కాంగ్రెస్ పతాకంలోని రంగులకు చోటు లభించినట్లు తెలుస్తున్నది. ఈ లోగోను దాదాపు ఖరారు చేసినట్లు వార్తలు వచ్చాయి. సాయంత్రం 4 గంటలకు రాజకీయ పార్టీల నేతలతో భేటీ తర్వాత రాష్ట్ర చిహ్నాన్ని ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగింది.