30-05-2024 RJ
తెలంగాణ
ఆదిలాబాద్, మే 30: పత్తివిత్తనాల కోసం రైతుల ఆందోళన కొనసాగుతోంది. ఆదిలాబాద్‌లో వరుసగా మూడోరోజూ రైతులు విత్తనాల కోసం రోడ్డెక్కారు. అయితే పలు జిల్లాల్లో విత్తన సంక్షోభం నెలకొన్నది. విత్తనాల కోసం రైతుల వెతలు అన్నీ ఇన్నీ కావు. పచ్చిరొట్ట విత్తనాలనే పంపిణీ చేయలేక రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. జనుము, జీలుగ, పచ్చి రొట్ట విత్తనాలు ఇవ్వలేని ప్రభుత్వం ఎరువులు, విత్తనాలు సరిపడా ఇస్తుందా..అని రైతులు ప్రశ్నిస్తున్నారు. తాజాగా పత్తి విత్తనాలకొరతపై రైతుల ఆగ్రహం వ్యక్తంగా చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో వరుసగా మూడో రోజు విత్తనాల కొరతతో అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు. వ్యాపారులు ఒక్కో రైతుకు రెండు ప్యాకెట్లు మాత్రమే సరఫరా చేస్తున్నారు. విత్తనాల పంపిణీ, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఆదిలాబాద్ పట్టణంలోని పంజాబ్ చౌక్‌లో రైతులు ధర్నా చేపట్టారు. దీంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి.
సమస్యను పరిష్కరించే వరకు ఆందోళన విరమించే ప్రసక్తే లేదని రైతులు తేల్చి చెప్పారు. ప్రభుత్వం వెంటనే స్పందించి విత్తనాల కొరత తీర్చాలని డిమాండ్ చేస్తున్నారు. డిమాండ్ ఉన్న ప్రముఖ కంపెనీ పత్తి విత్తనాలను హోల్‌సేల్ వ్యాపారి మరో దుకాణానికి తరలించడం ఆదిలాబాద్‌లో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. మూడు రోజులుగా రైతులు బారులు తీరి ఆ కంపెనీ విత్తనాల కోసం ఇబ్బందులు పడుతుండగా గురువారం ఆదిలాబాద్ పట్టణం కిసాన్ చౌక్‌లోని నిఖిల్ ట్రేడర్స్ విత్తనాల దుకాణం నుంచి వాహనంలో 160 బ్యాగులను ఇచ్చోడ కేంద్రానికి తరలిస్తుండగా రైతులు అడ్డుకున్నారు. రోజంతా లైన్లో నిల్చుంటే రెండు పత్తి విత్తన బ్యాగులు కూడా దొరకడం లేదని, ప్రైవేట్ డీలర్లు కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రైవేటు డీలర్‌ను నిలదీసిన రైతులంతా పంజాబ్ చౌరస్తా రహదారిపై బైఠాయించడంతో ఉద్రిక్తత నెలకొంది. వెంటనే డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి,జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య అక్కడికి చేరుకొని రైతులను సముదాయించే ప్రయత్నం చేశారు. హోల్ సేల్ దుకాణం నుంచి ఇచ్చోడ రిటైల్ డీలర్‌కు వే బిల్లుతో సహా పత్తి విత్తనాల ప్యాకెట్లు పంపుతున్నట్టు డీలర్ తెలిపాడు. దీంతో ఆగ్రహించిన రైతులు దొంగచాటుగా విత్తనాల అక్రమ వ్యాపారం సాగిస్తున్నారని నిలదీశారు. నిఖిల్ ట్రేడర్స్ నుంచి పత్తి విత్తనాల తరలింపు వ్యవహారంపై లోతుగా విచారణ జరుపుతున్నామని, కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. నిజంగానే బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హావిూ ఇవ్వడంతో రైతులు శాంతించారు. విత్తనాల కొరత, డీలర్ల ఆగడాలపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని వ్యవసాయ అధికారి పుల్లయ్య భరోసా ఇవ్వడంతో రైతులు రాస్తారోకో విరమించారు.