30-05-2024 RJ
తెలంగాణ
సిద్దిపేట, మే 30: ఉపాధి పనులు చేస్తున్న ఓ కూలీకి పురాతన కాలం నాటి వెండినాణాలు లభించాయి. మట్టి తీవ్వుతుండగా ఓ చిన్న డబ్బాలాంటిది దొరికింది. దానిని తెరిచి చూడగా అందులో పాత నాణాలు ఉన్నాయి. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం నర్సాయిపల్లి గ్రామంలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఉపాధి హావిూ పథకంలో భాగంగా పనులు చేస్తున్న కూలీలకు ఓ రాతి పాత్ర దొరికింది. దీంతో తొలుత రాతి పాత్రను ఓపెన్ చేసేందుకు కూలీలు భయపడ్డారు. కొంతమంది కూలీలు దానిని తెరిచి చూశారు.
ఆ పాత్రలో పురాతన కాలం నాటి 25 వెండి నాణెళిలు, రెండు వెండి ఉంగరాలు లభ్యమయ్యాయి. పురాతన నాణెములు దొరికిన విషయాన్ని గ్రామస్తులు బహిర్గతం చేయగా చేర్యాల సీఐ శ్రీను, మద్దూరు తహసీల్దార్ అనంతరెడ్డి, ఎంపీడీవో రామ్మోహన్ తదితర అధికారులు గ్రామానికి చేరుకొని, కూలీలకు దొరికిన నాణెళిలను పరిశీలించారు. ఇవి నిజాం కాలం నాటి నాణెములుగా భావిస్తున్నట్లు తెలిపారు. వాటిని వెంటనే స్వాధీనం చేసుకున్నారు. ఈ నాణెములు, ఉంగరాలను పురావస్తు శాఖకు పంపించనున్నట్లు అధికారులు తెలిపారు.