30-05-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, మే 30: నగరశివారు ప్రాంతంలో దారుణ ప్రమాదం చోటుచేసుకుంది. ఉదయం పాలప్యాకెట్ కోసం వెళ్లిన ఓ వ్యక్తి డిసిఎం రూపంలో వచ్చిన మృత్యువుకు బలయ్యాడు. పాల ప్యాకెట్ కోసం ఉదయాన్నే ఆ తండ్రి తన రెండేళ్ల చిన్నారితో కలిసి వెళ్లాడు. ఇంతలోనే డీసీఎం రూపంలో మృత్యువు అతన్ని కబళించింది. ఏం జరుగుతుందో తెలియని ఆ చిన్నారి గాయాలతో తండ్రి మృతదేహం వద్దే కన్నీళ్లు ఏడుస్తూ కూర్చున్నాడు. స్థానికులు సదరు చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. ఈ హృదయ విదారక ఘటన హైదరాబాద్ శివారు అబ్దుల్లాపూర్ మెట్ పరిధిలో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
అబ్దుల్లాపూర్‌మెట్ లోని ఇనాంగూడ వద్ద హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై గురువారం ఉదయం కనకప్రసాద్ అనే వ్యక్తి తన రెండేళ్ల కుమారుడితో కలిసి పాల ప్యాకెట్ తీసుకొచ్చేందుకు వెళ్లారు. ఈ క్రమంలో హైవేపై వీరు వెళ్తున్న బైక్‌ను విజయవాడ నుంచి వచ్చిన డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ప్రసాద్ మృతి చెందారు. బాలుడికి గాయాలు కాగా.. తండ్రి మృతదేహం వద్దే ఏడుస్తూ కూర్చున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడు ఏపీలోని కొవ్వూరు ప్రాంతానికి చెందినదిగా గుర్తించారు. జీవనోపాధి కోసం 10 రోజుల క్రితమే వీరి కుటుంబం ఈ ప్రాంతానికి వచ్చినట్లు తెలుస్తోంది.