30-05-2024 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి, మే 30: ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో బాగంగా పోలింగ్ రోజు, ఆ తర్వాత మాచర్లలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు సృష్టించిన అరాచకం అంతా ఇంతా కాదు. పోలింగ్ కేంద్రాల్లో పిన్నెల్లి సోదరులు తెలుగుదేశం పార్టీ ఏజెంట్లపై హింసకు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే టీడీపీ పోలింగ్ ఏజెంట్ నోముల మాణిక్యాలరావు పిన్నెల్లి చేతిలో తీవ్రంగా గాయపడ్డారు. గురువారం హైదరాబాద్‌లో టీడీపీ అధినేత నారాచంద్రబాబు నాయుడును తన నివాసంలో కలిశారు. పిన్నెల్లి సోదరుల అరాచకాన్ని బయటపెట్టాక తనకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశాడు. పిన్నెల్లి సోదరుల అరాచకాలపై విూడియాతో మాట్లాడటం, పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినప్పటి నుంచి మరింత కక్షగట్టారని చంద్రబాబుకు మాణిక్యాలరావు వివరించారు.
ఎమ్మెల్యే, అతని సోదరుడు తనను, తన కుటుంబాన్ని అంతమొందించేందుకు ప్రైవేటు సైన్యాన్ని ఉసిగొల్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రాణభయంతో ప్రస్తుతం హైదరాబాద్‌లో తలదాచుకున్నానని అన్నారు. పిన్నెల్లి చేతిలో తనకు ప్రాణహాని ఉందని ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాకు కూడా మొరపెట్టుకున్నానని వాపోయారు. ధైర్యంగా ఉండాలని, పార్టీ అండగా ఉంటుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు. మాణిక్యాలరావు పోరాటాన్ని చంద్రబాబు అభినందించారు.