30-05-2024 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి, మే 30: ఎన్నికల కౌంటింగ్ రోజున ఆందోళనలను ప్రేరేపించేలా ప్రభుత్వ సలహాదారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. వైసీపీ ఏజెంట్ల సమావేశంలోఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించి కౌంటింగ్ పక్రియకు భంగం కలిగించేలా సజ్జల మాట్లాడారని మండిపడ్డారు. గురువారం తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో దేవినేని ఉమా విూడియాతో మాట్లాడుతూ... సజ్జల రామకృష్ణారెడ్డిపై వెంటనే క్రిమినల్, బెదిరింపు వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల చట్టాలను ధిక్కరించేలా కౌంటింగ్ ఏజెంట్లను ప్రేరేపించడం ద్వారా మోడల్ ప్రవర్తనా నియమావళిని సజ్జల ఉల్లంఘించారని చెప్పారు.
కౌంటింగ్ పక్రియకు ముందు సజ్జల రామకృష్ణా రెడ్డి చేసిన తీవ్రమైన నేరంగా పరిగణించాలని కోరారు.సజ్జల వ్యాఖ్యలను చూస్తుంటే.. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల విధుల్లో ఉన్న ప్రభుత్వోద్యోగులను బెదిరించినట్లేనని అన్నారు. సజ్జల ప్రకటన రెచ్చగొట్టే విధంగా ఉందని చెప్పారు. కౌంటింగ్ పక్రియకు భంగం కలిగించే ఉద్దేశ్యంతో అతను మోడల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని అన్నారు. వివిధ వర్గాల మధ్య, సమూహాల మధ్య చీలిక, ద్వేషం సృష్టించే ఉద్దేశ్యంతో సజ్జల ఉన్నారన్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం ఆయనపై క్రిమినల్ కేసు నమోదుచేయాలని ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. కాగా.. సజ్జలపై వ్యాఖ్యలపై తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ ఫిర్యాదు చేశారు.