30-05-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, మే 30: తెలంగాణవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. హైదరాబాద్ సహా అనేక ప్రాంతాల్లో ఎండలు మండుతున్నాయి. అకాల వర్షాలు ముఖం చాటేయడంతో ఉదయం నుంచే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. మళ్లీ గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ తీపికబురు చెప్పింది. రాష్ట్రంలో జూన్ ఒకటి నుంచి మూడురోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. జూన్ ఒకటిన భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబాబూబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
అలాగే, 2వ తేదీ నుంచి 3వ తేదీ వరకు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. శుక్రవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశాలున్నాయని చెప్పింది. మరో వైపు నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. రుతుపవనాలు లక్షద్వీప్ ప్రాంతం విూదుగా కేరళలోకి ప్రవేశించాయని పేర్కొంది. రుతుపవనాల విస్తరణకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని పేర్కొంది. కర్ణాటక, తమిళనాడులోని కొన్ని భాగాలు, నైరుతి, మధ్య బంగాళాఖాతం, పశ్చిమ బెంగాల్, సిక్కీంలోని పలు ప్రాంతాల్లోకి రాబోయే రెండుమూడు రోజుల్లోనే విస్తరిస్తాయని వాతావరణశాఖ తెలిపింది.