30-05-2024 RJ
తెలంగాణ
కొండగట్టు, మే 30: రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జూన్ 1 వరకు వేడుకలు కొనసాగనున్నాయి. ఉత్సవాల నేపథ్యంలో దీక్ష విరమణ కోసం హనుమాన్ మాలధారులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. భక్తులకు ఇబ్బంది కలుగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. దీక్షా విరమణ కోసం 300 మంది అర్చకులను, తలనీలాల సమర్పణ కోసం 1500 మంది నాయి బ్రహ్మణులను అధికారులు నియమించారు.
4 ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. కొండపైకి చేరేందుకు ఆర్టీసీ నాలుగు ఉచిత బస్సులను నడుపుతున్నది. తాగునీరు, చలవ పందిళ్లను అధికారులు ఏర్పాటు చేశారు. భద్రాచలం శ్రీ సీతారాముల తరపున భద్రాద్రి ప్రధాన అర్చకులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కళాకారులు ప్రదర్శించిన వివిధ కళారూపాలు భక్తులను ఆకట్టుకున్నాయి.