31-05-2024 RJ
తెలంగాణ
రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం గత ఆరు నెలల పనితీరును పరిశీలిస్తే.. ప్రజా స్వామ్యయుతంగా ముందుకు సాగుతున్నదనే చెప్పాలి. కలిసి చర్చించిడం, ఉమ్మడిగా నిర్ణయాలు తీసుకోవడం ఆహ్వానించదగ్గ పరిణామం. తాజాగా తెలంగాణ గీతాన్ని ఆమోదించే క్రమంలోనూ అఖిల పక్షాన్ని పిలిచి, వారితో చర్చించి, వారు ఆమోదించిన తరవాత గీతాన్ని ఆమోదించారు. తెలంగాణ అవతరణ దినోత్సవాన జూన్ 2న దీని ఆవిష్కరణ జరుగనుంది. ఇలాంటి నిర్ణయాలు మంచి సంప్రాదాయన్ని తెలియచేస్తాయి. తెలంగాణ ఏర్పడ్డ తొమ్మిదన్నరేళ్ల కెసిఆర్ పాలనలో అఖిలపక్షాలు లేవు.. సంప్రదింపులు లేవు.. చర్చలు లేవు.. ఏదైనా ఏకపక్ష నిర్ణయాలు... ఫామ్‌హౌజ్ చర్చలు అన్నచందంగా మారింది.
ప్రజాస్వామ్యాన్ని పాతరేసిన కల్వకుంట్ల వారు ఇప్పుడు ప్రజల గురించి మాట్లాడడం ప్రజలు కూడా జీర్ణించుకోలేక పోతున్నారు. అయితే ఎన్నికలు జరగడం.. ఫలితాల్లో ఓ పార్టీ అధికారంలోకి రావడంతో మిగతా ఎన్నికైన వారిని పాలనకు దూరంగా పెట్టడం సరికాదు. వారు కూడా ప్రజలు ఎన్నుకుంటేనే ఎమ్మెల్యేలు, ఎంపిలుగా ఎన్నికయ్యారు. కాబట్టి ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని చర్చించాలి. ప్రజలకు తెలియచేయాలి. ఏకపక్ష నిర్ణయాలు సరికాదని గుర్తించాలి. సిఎం రేవంత్ రెడ్డి కూడా మున్ముందు మరింత పారదర్శకంగా, ప్రజాస్వామ్యయుతంగా నిర్ణయాలు తీసుకుని ఆదర్శ పాలనకు శ్రీకారం చుట్టాలి. దశాబ్ది ఉత్సవాల వేళ అందెశ్రీ గీతాన్ని రాష్ట్ర గీతంగా ఆమోదించడం, అఖిలపక్షంలో చర్చించడం ఆహ్వానించదగ్గ నిర్ణయం.
మాజీ సిఎం కెసిఆర్‌ను కూడా ఉత్సవాలకు ఆహ్వానించడం రేవంత్ నాయకత్వంతో పాటు, ఆయన హుందాతనానికి ప్రతీకగా నిలుస్తుంది. ఇక పాలనా పరంగా ఉన్న అనేకానేక సమస్యలను కూడా ప్రజా ప్రతినిధుల, క్షేత్రస్థాయి నాయకులతో చర్చించి నిర్ణయాలు తీసుకుని ప్రజలకు మేలు జరిగేలా చేయాలి. ఏయే అంశాలపై ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో వాటిని ముందుకు చర్చించాలి. తెలంగాణ ఏర్పడ్డ తరవాత గత దశాబ్ద కాలం పరిశీలిస్తే సిఎం కెసిఆర్ కీలక నిర్ణయాలు తీసుకుని ప్రజలకు సంబంధం లేకుండా పాలన చేశారు. దీంతో అప్పులు చేసి తెలంగాణను అథఃపాతాళానికి నెట్టారు. దీనిపై మాట్లాడితే.. తెలంగాణ పరువు తీస్తున్నారని కెటిఆర్, హరీష్ రావులు అంటున్నారు. అప్పులు చేసినట్లు చెబితే తప్పెలా అవుతుందో చెప్పాలి. ప్రధానంగా సాగునీటి రంగంలోనూ, విద్యుత్ రంగంలోనూ కీలక నిర్ణయాలు తీసుకు న్నట్లు చెప్పి, ఆయా రంగాల్లో పెద్ద ఎత్తున అప్పులను చేశారు.
ఆర్థిక పరమైన నిర్ణయాల్లో విచ్చలవిడి కారణంగా రాష్ట్రంలో మరిన్ని సమస్యలకు దారితీసింది. ఇప్పుడు అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వానికి గుదిబండగా మారింది. ఈ సమస్యలపై రేవంత్ ప్రత్యేక దృష్టి సారించాల్సి అవసరం ఉంది. ఇక రైతు రుణమాఫీ అన్నది కూడా నిరంతరాయంగా కొనసాగించడం సరికాదు. రైతులకు కావాల్సింది మాఫీలు కాదు.. పంటలు పండగానే కొనుగోలుచేసి వారు రోడ్డెక్కకుండా చేయగలగాలి. విత్తనాలు, ఎరువుల అందుబాటులో ఉంచాలి. ఏ పొలంలో ఏ పంట వేయాలన్నది క్షేత్రస్థాయిలో వ్యవసాయాధికారుల ద్వారా చెప్పించాలి. అదేపనిగా వరి వేయడం కాకుండా డిమాండ్ ఉన్న పంటలను పండిరచేలా..వాటిని కొనుగోలు చేస్తామన్న భరోసాను రైతులకు కలిగించాలి. మార్కెట్ యార్డులు, రైతు సంఘాలను బలోపేతం చేయాలి. కెసిఆర్ హయాంలో రైతుబంధు సమితి నేతలు ఏనాడూ క్షేత్రస్థాయిలోకి వెళ్లి రైతుల సమస్యలపై ఆరా తీయలేదు.
అలాకాకుండా రైతులు ఏం కోరుకుంటున్నారో చేయగలగాలి. పత్తివిత్తనాల కోసం ఆదిలాబాద్‌లో రైతులు చేస్తున్న ధర్నాలను సీరియస్‌గా తీసుకుని అక్కది నేతలు నేరుగా వెళ్లి పరిష్కరించే చొరవ చూపాలి. ఉత్సవ విగ్రహం లాంటి నేతలను పక్కన పెట్టాలి. అలాగే ఉచిత విద్యుత్‌పైనా నియంత్రణ ఉండాలి. వ్యవసాయ మోటర్లకు విూటర్లు పెట్టి విద్యుత్ వినియోగాన్ని అంచనా వేయాలి. అలాగే వ్యవసాయా నికి నిజంగానే ఎంత కరెంట్ అవసరమో అంతే ఉచితంగా ఇవ్వాలి. దుబారాకు కళ్లెం వేయకపోతే దాని ప్రభావం కూడా ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా ఉంటుంది. ఉచిత బస్సులను కూడా తాహతును బట్టి,పేద,బడుగు మహిళలకే పరిమితం చేయాలి. జూన్ 2న అవతరణ దశాబ్ది దినోత్సవాలు జరుపుకుంటున్న వేళ కఠిన నిర్ణయాలతో తెలంగాణ సర్వతోముఖాభివృద్దికి ముందుకు సాగాలి. వివిధ రంగాల్లో గట్టి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా తెలంగాణ పురోగమనంలో కీలక అడుగులు వేయాలి. గతంలో జరిగిన తప్పులను సరిదిద్దుకుంటూనే తెలంగాణ ముఖచిత్రం మార్చేలా నిర్ణయాలకు శ్రీకారం చుట్టాలి.
బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఆచరించిన, అనుసరించిన, అవలంబించిన అన్ని విధానాలను సవిూక్షించుకుని ముందుకు సాగడం అలవర్చుకోవాలి. సిఎం రేవంత్‌పై ప్రజలు విశ్వాసాన్ని ఉంచినందున.. అందుకు తగ్గట్లుగా హావిూలను నెరవేర్చే బాధ్యతలను చిత్తశుద్దితో అమలు చేయాలి. తెలంగాణ కోటి రతనాల వీణగా భాసిల్లా లంటే అందుకు కావలసిన సంకల్పబలాన్న చాటాలి. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలి. ఉచిత విద్యుత్ పథకం మంచిదే అయినా సవిూక్షించుకుని పక్కాగా అమలు చేయాల్సి ఉంది. ఉచిత విద్యుత్‌కు విఘాతం కలిగించకుండా విూటర్లు పెట్టి విద్యుత్ వాడకాన్ని లెక్కించుకోవడం అన్నది అకౌంటబులిటీని తెలియ చేస్తుంది. ఇదే తరహాలో తెలంగాణలో విూటర్లు పెట్టి ఏ రైతులకు ఎంత పొలం ఉంది.. వారు ఏ పంటలు వేస్తున్నారో లెక్కలు తీయాలి. ఏ పంటకు ఎంత విద్యుత్ అసవరమో అన్నది గుణించాలి. అన్నింటికి మించి పాతబస్తీలో అక్రంగా వాడుతున్న కరెంట్‌పై కన్నేయాలి.
ఇలా దౌర్జన్యం చేస్తున్న వారిని పట్టుకుని కేసులు పెట్టాలి. దొంగ కరెంట్ వాడకం అన్నది నేరంగా గుర్తించి, దీనిని అరికట్టగలగాలి. లేకుంటే బిల్లులు కట్టే వారిపైనే అధిక భారం పడుతూ పోతోంది. ఇదే సందర్భంలో ఖజనాకు భారంగాను, ప్రజలకు భారంగానూ మారుతున్న పథకాలను సవిూక్షించుకోవడంలో తప్పులేదు. విద్యుత్ వాడకంపై నియంత్రణ లేకుంటే ఉచిత పథకాలు మెడకు చుట్టుకుంటాయి. ఇదే సందర్భంలో దుబారాను అరికట్టకపోతే మరింత భారం తప్పదు. ఇది ఉభయ తెలుగు రాష్ట్రాలకు వర్తిస్తుంది. దశాబ్ది ఉత్సవాల వేళ రేవంత్ సర్కార్ మంచి నిర్ణయాలతో ప్రజలకు మరింత చేరువ కావడానికి ముందుకు సాగాలని ఆశిద్దాం.