31-05-2024 RJ
ఆంధ్రప్రదేశ్
విజయవాడ, మే 2: ఏపీ రాజధాని అమరావతా.. విశాఖపట్టణమా.. ఇప్పుడీ ప్రశ్న మళ్లీ మొదలయ్యింది. ఎన్నికల ఫలితాలతోనే దీనికీ స్పష్టత రానుంది. జగన్ అధికారం చేపడితే చలో విశాఖ.. చంద్రబాబు అయితేనే అమరావతి..ఇదీ పరిస్థితి. ఫలితాలతోనే రాజధాని కూడా స్పష్టం అవుతుంది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్‌లో విచిత్ర పరిస్థితి నెలకొంది. పాలనాకేంద్రం అన్నది లేకుండా ఐదేళ్ల కాలం గడిచిపోయింది. ఇక ఎపి రాజధాని ఏది అని అడిగితే చెప్పే పరిస్థితి లేదు. మూడు రాజధానులా అంటే అదీ లేదు. తలలేని మొండెంలా ఆంధ్రప్రదేశ్ గత కొన్నాళ్లుగా సాగుతోంది. రాజధాని అంటూ ఒకటి లేకుండా చేసి..అభివృద్ది వికేంద్రీకరణ అంటూ సిఎ వైఎస్ జగన్ ప్రతిపాదనను మంత్రులు, అధికారులు తానా అంటే తందానాలాగా ప్రచారం చేపట్టారు. ఇప్పుడు ఎన్నికలు ముగిసాయి. నాలుగున ఫలితాలు రానున్నాయి. కొత్త ప్రభుత్వం వస్తేనే అమరావతి ముందుకు వస్తుంది.
జగన్ మళ్లీ అధికారం చేపడితే విశాఖను రాజధాని చేయడం ఖాయం. విశాఖ రాజధాని అంటున్న సిఎం జగన్ ఎప్పుడు అటువైపు వెళతారన్నది ఫలితాలతో తేలనుంది. గత ఐదేళ్లలో రాజధాని, పాలనాకేంద్రాలపై ముఖ్యమంత్రులు తీసుకున్న నిర్ణయాలతో ఏం జరుగుతుందో ప్రజలకు తెలియలేదు. ఓ వ్యూహం ప్రకారం ప్రజలకు, పాలకులకు మధ్య సంబధాలు లేకుండా చేశారు. ప్రభుత్వంలో ఏం జరుగుతుందో తెలుసుకునే పరిస్థితి లేకుండా చేశారు. ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నించే పరిస్థితి లేకుండా పోయింది. జగన్ అధికారంలోకి వస్తే ఇలాంటి దుర్గతి వస్తుందని ఎవరుకూడా ఊహించి ఉండరన్న ఆరోపణలుఉన్నాయి. అభివృద్ది వికేంద్రీకణ వేరు..రాజధాని వేరు అన్న స్పృహలో నేతలు లేరు. వారు చెప్పిందే వేదంలాగా..తాము పట్టిన కుందేటికి మూడు రాజధానులు అన్న చందంగా పాలన సాగించారు. చివరకు రాజధాని లేకుండా చేసుకున్నారు.
అందుకే అక్కడ ఆందోళనలు కొనసాగాయి. అయినా ప్రభుత్వం చలించలేదు. ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి పాలనా వ్యవహారాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేసారు. జగన్ ఏం చేస్తున్నారో ఎవరికీ తెలియదు. నిరంకుశ పాలన సాగుతున్నా ప్రశ్నించేవారు లేకుండా పోయారు. అలాగే ప్రశ్నించే వారిని ద్రోహులుగా చిత్రీకరించారు. ఇక అమరావతికి సంబంధించి ... రాజధానిగా అమరావతినే కొనసాగించాలని, మూడు రాజధానుల నిర్ణయాన్ని ఉపసంహరిం చాలని డిమాండ్ చేస్తూ నాలుగేళ్లుగా సాగిస్తున్న ఉద్యమంలో పోలీసుల కేసులు పెరిగాయి. పలువురు రైతులు, మహిళలు కోర్టులు చుట్టూ తిరగడంతోనే సరిపోతోంది. కేసులతో వారిని కోర్టులకే పరిమితం చేస్తే ఇక ఉద్యమంలో కనిపించరన్న ఎత్తుగడలా ఉంది. నిరసనకారులపై అనేక కేసులు నమోదయ్యాయి. వీరిలో చాలామందిని వివిధ జైళ్లకు తరలించారు. కొందరు బెయిలుపై విడుదలయ్యారు. మరికొందరు రైతులు జైళ్లలోనే ఉన్నారు. అనేకమంది రైతులు ఉల్లంఘనల కేసులను ఎదుర్కొంటున్నారు.
జైలుకు వెళ్లి వచ్చిన అనేక మంది మళ్లీ ఉద్యమాల్లో భాగస్వాములయ్యారు. వారిలో కొందరు ముఖ్య నేతలు రెండు, మూడు కేసుల్లో ఉన్నారు. వారిలో అత్యధికులు మందడం, తుళ్లూరు గ్రామాలవారే కావడం గమనార్హం. మహిళలు, రైతులు పెద్ద సంఖ్యలో ఆందోళనలో పాల్గొన్నారు. వీరంతా ఇప్పుడు ఏ ప్రభుత్వం వస్తుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఇందులో కొందరికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. మళ్లీ జనగ్ పాలనకు వస్తే ఇప్పుడు మళ్లీ ఈ భూములు ఏంచేస్తారో స్పష్టత లేకుండా రాజధాని మారుస్తామంటున్నారు. కనీసం రైతులతో మాట్లాడకుండా, వారి అభిప్రాయాలు తెలుసుకోకుండా తీసుకున్న నిర్ణయంగా వ్యవహారం చాలాముందుకు వెళ్లింది. మొత్తంగా ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఎవరన్నది తేలితే రాజధాని ఎక్కడ అన్నది స్పష్టత వస్తుంది. జగన్ అధికారం చేపడితే మళ్లీ విశాఖకు మారడం ఖాయం కానుంది. చంద్రబాబు అధికారంలోకి వస్తేనే అమరావతికి ప్రాణప్రతిష్ట కానుంది.