31-05-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, మే 31: డిపాజిట్ల పేరుతో రూ.200 కోట్లకు కుచ్చుటోపి పెట్టిన కేసులో ప్రధాన నిందితురాలు తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంక్ జనరల్ మేనేజర్ నిమ్మగడ్డ వాణిబాలను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆమె భర్త మెకా నేతాజీ తో పాటు అతని కుమారుడు శ్రీ హర్షను కూడా అరెస్ట్ చేశారు. తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంకులో పనిచేసే 140 మంది ఉద్యోగులను వాణి బాల మోసం చేశారు. ఆమె మాటలు నమ్మిన ఉద్యోగులు 26 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు. ఈ డబ్బు మొత్తాన్ని వాణి బాలకు చెందిన ప్రియాంక ఎంటర్ ప్రైజెస్‌లో డిపాజిట్ చేశారు. శ్రీ ప్రియాంక ఎంటర్ ప్రైజెస్ పేరుతో అబిడ్స్‌లోని తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంక్ జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్న నిమ్మగడ్డ వాణి బాల సుమారు 532 మంది నుంచి డిపాజిట్లు వసూలు చేశారు.
ఆమె భర్త మేక నేతాజీ, కొడుకు మేక శ్రీహర్షలు డిపాజిట్ల సేకరణ చేశారు. నెలకు 24 శాతం రిటర్న్ ఇస్తామని నమ్మబలికారు. మొత్తం 532 మంది నుంచి డిపాజిట్లు వసూలు చేసి ఆ డబ్బులు తీసుకొని పరార్ అయ్యారు. దీంతో వాణి బాలను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. విషయం బయట పడడంతో బాధితులు తమకు న్యాయం చేయాలని కోరుతూ సీసీస్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో వాణి బాల చిట్ ఫండ్ కంపెనీ, శ్రీ ప్రియాంక ఎంటర్ ప్రైజెస్‌పై పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు. సుమారు రూ. 200 కోట్ల స్కామ్ జరిగినట్లు గుర్తించారు. ప్రధాన నిందితురాలు నిమ్మగడ్డ వాణిబాలతో పాటు ఆమె భర్త, కొడుకును అరెస్ట్ చేశారు.