31-05-2024 RJ
తెలంగాణ
భద్రాద్రి కొత్తగూడెం, మే 31: జిల్లాలో బడిబాట కార్యక్రమాన్నిజూన్ 3 నుంచి నిర్వహించేందుకు రంగం సిద్దం చేశారు. బడిబయట ఉంటున్న విద్యార్థులను బడిలో చేర్పించేలా కార్యక్రమం ముందుకు తీసుకుని వెళతామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాశాఖాధికారి వెంకటేశ్వరాచారి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెంపొందించేందుకు ఏటా ’బడిబాట’ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించనున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో బోధనా వసతులను తల్లిదండ్రులకు వివరించి పిల్లలకు ప్రవేశాలు కల్పించనున్నారు. రోజుకొక ప్రత్యేకతతో జూన్ 19 వరకు సుమారు పక్షం రోజుల పాటు కార్యక్రమాల్ని నిర్వహిస్తారు. తల్లిదండ్రుల్లో చైతన్యం కల్పించి సర్కారు బడుల్లో ప్రవేశాల సంఖ్య పెంచాలని, ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలని అధికారులకు విద్యాశాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఏటా విద్యా సంవత్సరం ప్రారంభానికి పక్షం రోజుల ముందే బడిబాట నిర్వహిస్తుంటారు.
మునుపటి కంటే ఈ కార్యక్రమానికి ఆదరణ పెరుగుతున్నట్లు విద్యాశాఖ గుర్తించింది. వినూత్న కార్యక్రమాలతో పిల్లలు, వారి తల్లిదండ్రులను ఆకట్టుకొని సత్వర ప్రవేశాలు కల్పించాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే తెలుగుతో పాటు ఆంగ్ల మాధ్యమంలోనూ బోధన సాగుతోంది. ఉపాధ్యాయుల బోధన నైపుణ్యాలు మెరుగుపడేందుకు నిరంతర శిక్షణలు ఇస్తున్నారు. విద్యార్థులకు కార్పొరేట్ విద్యాలయాల స్థాయిలో రెండు జతల ఏకరూప దుస్తులు, ద్విభాషా పాఠ్య పుస్తకాలు, రాత పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం వడ్డిస్తున్నారు. ఉదయాన్నే రాగిజావ అందిస్తున్నారు. రవాణా భత్యం వంటివీ సమకూర్చుతున్నారు. వీటన్నింటితో పాటు గత సంవత్సరం సాధించిన ఉత్తమ ఫలితాలు ప్రవేశాల పెంపునకు దోహదపడతాయని ఉపాధ్యాయులు భావిస్తున్నారు.