31-05-2024 RJ
తెలంగాణ
ఆదిలాబాద్, మే 31: విత్తన గోదాముల్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటిష్ఠ చర్యలు చేపట్టామని జిల్లా ఎస్పీ గౌష్ ఆలం పేర్కొన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ పట్టణంలోని విత్తన, ఎరువుల గోదాములను వ్యవసాయ శాఖ అధికారులు, డీఎస్పీ జీవన్ రెడ్డితో కలిసి ఎస్పీ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ఉన్న విత్తన గోదాముల్లో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నట్లు చెప్పారు. ఎవరు బ్లాక్ చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వారి వెంట జేడీఏ పుల్లయ్య తదితరులు అన్నారు. ఇదిలావుంటే ఒకే రకం విత్తనాలు వాడొద్దని, ప్రతికూల వాతావరణం ఏర్పడితే నష్టపోయే ప్రమాదం ఉందని ఏఈవో శంకర్ పేర్కొన్నారు.
బెల్సరీ రాంపూర్ లో రైతులకు విత్తన కొనుగోళ్లలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. జిల్లాలో 50 రకాల పత్తి విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, అవన్నీ ప్రభుత్వ గుర్తింపు పొందినవేనని చెప్పారు. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసిన రసీదులు తప్పకుండా తీసుకోవాలని సూచించారు. తక్కువ ధర, ఎక్కువ దిగుబడి వస్తుందని గ్రామాలకు వచ్చి మాయ మాటలు చెప్పే వారిని నమ్మవద్దని కోరారు.