01-06-2024 RJ
తెలంగాణ
నిజామాబాద్, జూన్ 1: బిజెపికి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయం కేవలం కెసిఆర్‌తో సాధ్యమని ఎమ్మెల్యే వేముల ప్రశాంతరెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని ముందే గుర్తించి కేంద్రంలో మోడీకి ప్రత్యామ్నాయం కావాలని కోరుకున్న మొదటి నాయకుడు కెసిఆర్ అని గుర్తు చేశారు. ఫెడరల్ ఫ్రంట్ ప్రతిపాదన తీసుకుని వచ్చిన మొదటి నేత కూడా కెసిఆర్ అన్నారు. నిజానికి ఆనాడు కెసిఆర్ ప్రతిపాదనపై ఓ అడుగు ముందుకు వేసివుంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నారు. గతకొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచార సరళి, జాతీయ రాజకీయాల్లో వస్తున్న మార్పులు చూస్తుంటే కెసిఆర్ జాతీయ రాజకీయాల్లో కలీలక భూమిక పోషించినా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదన్నారు. ఈ విషయంలో కెసిఆర్ ఆలోచన చేస్తున్నారని అన్నారు. ఎన్నికల ఫలితాల తరవాత కేంద్రంలో జాతీయ రాజకీయాల్లో పెను మార్పులు సంభవిస్తాయని అన్నారు.
కాంగ్రెస్, బిజెపిలు సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగే స్థితిలో లేవని అన్నారు. బిఆర్‌ఎస్ జాతీయ రాజకీయాల్లో బాణంలా దూసుకుపోవడం ఖాయమని అన్నారు. సంకీర్ణ రాజకీయాల్లో ఏదైనా సాధ్యం అన్నారు. అయితే ప్రత్యామ్నాయ రాజకీయాలు కేవలం కెసిఆర్‌కు మాత్రమే సాధ్యమని వేముల అన్నారు. ఢిల్లీలో నిర్ణాయక శక్తిగా అవతరించడానికి కెసిఆర్‌కు మాత్రమే అవకాశం ఉందన్నారు. కెసిఆర్‌తోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. తెలంగాణ తరహా అభివృద్ధి చేయాలంటే బిఆర్‌ఎస్ పటిష్టంగా ముందుకు సాగాల్సి ఉందని అన్నారు. ఎన్నికల్లో అతధిక ఎంపి సీట్లను సాధిస్తామన్న విశ్వాసం ఉందని, అందుకే మళ్లీ కెసిఆర్ తన విశ్వరూపం చూపడం ఖాయమని అన్నారు. జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్, బిజెపిల కాలం చెల్లిందని అన్నారు. జాతీయ రాజకీయాల్లో ఇప్పుడు మోడీపై నమ్మకం పోయిందని, అలాగే కాంగ్రెస్‌ను మరోమారు ప్రజలు నమ్మే స్థితి లేదన్నారు. వివిధ పార్టీల్లో సత్తా కలిగిన నేత ఎవర్న చర్చ వచ్చినప్పుడు అంతా కెసిఆర్ వైపు చూస్తున్నారని అన్నారు.
గతంలో తాము వివిధ పార్టీల నాయకులతో మాట్లాడినప్పుడు ఇదే భావన వ్యక్తం అయ్యిందన్నారు. దేశం పట్ల స్పష్టమైన అవగాహన కెసిఆర్‌కు ఉందన్నారు. 75 సంవత్సరాలు దేశాన్ని పాలించిన నాయకులు దేశ అభివృద్ధిని పట్టించుకున్న దాఖలాలు లేవని విమర్శించారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ తొమ్మిదిన్నరేళ్లలో రైతుల పక్షాన నిలబడి నిరుపేద ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. కెసిఆర్ జాతీయనేతగా ఎదిగితే సమస్యలను పరిష్కరిస్తూ దేశ ప్రగతిని మరింత పెంచవచ్చన్నారు. ప్రస్తుతం దేశ ప్రజలకు చౌకీదార్, టేకేదార్ అవసరం లేదని ప్రజలకు మెరుగైన పాలన అందించే నాయకులు, ధృడ సంకల్పంతో ఉన్న సైనికుడు కావాలన్నారు. దేశ ప్రధాని మోదీకి ప్రజల సమస్యలపై ఎటువంటి అవగాహన లేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రజల సొమ్ముతో అవినీతి అక్రమాలకు పాల్పడుతూ వేలాది కోట్ల రూపాయాలు దోచుకున్నారని ఆరోపించారు.
దేశావసరాలు, నదుల అనుంధానం, రైతులు, వ్యవసాయ రంగంపై కెసిఆర్‌కు స్పష్టమైన అవగాహన ఉంది. అలాంటి కేసీఆర్ ప్రధానమంత్రి అయితే దేశ ప్రజలు అన్ని విధాలా లబ్ధిపొందుతారని అన్నారు. అదే సమయంలో దేశంలోని అనేక ప్రాంతీయ పార్టీల నేతలు కేసీఆర్ ముందుచూపును స్వాగతించి ఉంటే ఇప్పటికే ఓ రాజకీయాల్లో ఓ మలుపు తిరిగేవని అన్నారు.