01-06-2024 RJ
తెలంగాణ
జగిత్యాల, జూన్ 1: జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొండగట్టు అంజన్న ఆలయంలో హనుమాన్ పెద్ద జయంత్యుత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఆంజనేయస్వామి క్షేత్రం రామనామ జపంతో మారుమోగుతోంది. దీక్షా విరమణ చేసేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కాషాయమయంగా మారిపోయాయి. పెద్ద హనుమాన్ జయంతి నేపథ్యంలో మాలదారులు, భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. శుక్రవారం సాయంత్రం నుంచి హనుమాన్ మాలధారులు విరమణ కోసం క్షేత్రానికి వేల సంఖ్యలో తరలి వచ్చారు. స్వామి దర్శనం కోసం క్యూలైన్లలో బారులుదీరారు. రాత్రి 10 గంటలు దాటిన తర్వాత కూడా వేల సంఖ్యలో నిరీక్షిస్తూ ఉన్నారు. వారి భజనలతో క్షేత్రం శ్రీరామ నామస్మరణతో మారుమోగింది.
జిల్లా కలెక్టర్ యాస్మిన్‌బాషా రాత్రివేళ ఆలయానికి వచ్చి ఏర్పాట్లను పరిశీలించారు. ఉత్సవాల్లో భాగంగా శనివారం అంజన్న జయంతిని ఘనంగా నిర్వహించారు. గురువారం ఈ ఉత్సవాలు ప్రారంభం అయినప్పటి నుంచి భక్తులు దీక్ష విరమణ కోసం భారీగా తరలివచ్చారు. ఇప్పటికే ఆలయానికి చేరుకున్న వారు అంజన్నను దర్శించుకుని, దీక్షను విరమిస్తున్నారు. అధికార యంత్రాంగం అంతా ఇక్కడే ఉండి ఉత్సవాల నిర్వహణ చూస్తున్నారని, తాగునీరు, వైద్య సేవలు, పారిశుద్ధ్య నిర్వాహణపై దృష్టి పెడుతునట్లు పేర్కొన్నారు. కోనేరులో నీళ్లను ఎప్పటికప్పుడూ మార్చుతున్నట్లు చెప్పారు. జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఆధ్వర్యంలో 650 మంది పోలీసులతో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. కొండపైకి చేరుకునేలా నాలుగు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. శనివారం మధ్యాహ్నం వరకు దీక్షాపరుల రద్దీ కొనసాగుందని అధికారులు తెలిపారు.