01-06-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జూన్ 1: తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ వేడుకల్లో అందరినీ భాగస్వాములను చేయనుంది. గత పదేండ్లలో లేని విధంగా అందరినీ కలుపుకుని, రాజకీయాలకు అతీతంగా ఆవిర్భావ వేడుకలు నిర్వహించాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. ఉదయమే గన్‌పార్క్ వద్ద అమరులకు సిఎం రేవంత్ నివాళి అర్పించి, అక్కడి నుంచి పరేడ్ గ్రౌండ్స్‌లో జెండా ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరిస్తారు. ఈ ఉత్సవాలకు గవర్నర్ రాధాకృష్ణన్‌ను సిఎం రేవంత్ రెడ్డి, డిప్యూటి సిఎం భట్టి విక్రమార్కలు స్వయంగా ఆహ్వానించారు. ముఖ్య అతిథిగా రావాలని సోనియాను ఆహ్వానించినా ఆమె రాక అనుమానమని అంటున్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ పరిసరాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.
జూన్ 2న ఉదయం పరేడ్ మైదానంలో జాతీయ జెండా ఆవిష్కరణ, ఇతర కార్యక్రమాలు ఉంటాయి. సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన కళాబృందాలతో ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఈ సందర్భంగా జయజయే తెలంగాణ గీతాన్ని సిఎం రేవంత్ జాతికి అంకితం చేయనున్నారు. కళాకారులు, కవులు, ఉద్యమకారులను సన్మానించానున్నారు. ఇకపోతే గత ప్రభుత్వం 2014 నుంచి 2023 దాకా పదేండ్లలో ఒక్కసారి కూడా ఉద్యమకారులను ఆవిర్భావ వేడుకలకు ఆహ్వానించలేదు. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఆవిర్భావ వేడుకల్లో పాల్గొనాలని ఉద్యమకారులందరికీ ఆహ్వానం పంపించింది. కలెక్టర్ల ద్వారా ఆహ్వానాలు వెళ్లాయి. ఆవిర్భావ వేడుకల్లో ఆదివారం ఉదయం పరేడ్ గ్రౌండ్‌లో పోలీసుల కవాతు ఉంటుంది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు.
సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. కార్నివాల్, లేజర్ షో లాంటి కార్యక్రమాలతో పాటు ఫుడ్, గేమింగ్ స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ట్యాంక్ బండ్ పై జాతీయ జెండాలతో మార్చ్`ఫాస్ట్ కూడా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాలకు సీఎం రేవంత్, మంత్రులు, ఇతర ప్రముఖులు హాజరుకానున్నారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియా రావడం లేదని తెలుస్తోంది. అంతకంటే ముందే ఈ అంశం రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. సోనియా ఆహ్వానాన్ని బీజేపీ నేతలు తప్పుబట్టారు. అయితే తెలంగాణ దేవత అయిన సోనియాను ఎందుకు ఆహ్వానించకూడదని ప్రశ్నించారు అధికార పార్టీ నేతలు. చివరికి వ్యక్తిగత కారణాలతో సోనియా గాందీ తెలంగాణ పర్యటన రద్దు అయ్యింది. జూన్ 2న తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెట్టి సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆవిర్భావ వేడుకలకు సోనియాను ఆహ్వానించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వలో జరిగిన భేటీలో కేబినెట్ నిర్ణయించింది.
ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని ఢల్లికి వెళ్లి ముఖ్య అతిథిగా రావాలంటూ ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే ఈ వేడుకలకు సోనియా గాంధీ హాజరు కావడం లేదని ఏఐసీసీ తెలిపింది. అనారోగ్యం కారణాలతో సోనియా గాంధీ తెలంగాణ పర్యటన రద్దు చేసుకున్నట్లు పేర్కొంది. కాగా, షెడ్యూల్ ప్రకారం ఆదివారం సోనియా గాంధీ తెలంగాణకు రావాల్సి ఉంది. వైద్యుల సూచన మేరకు తెలంగాణ పర్యటనకు రాలేకపోతున్నట్లు వెల్లడిరచారు. తెలంగాణ 10 ఏళ్ల ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాజ్ భవన్ వెళ్లి రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌తో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు రావాలని గవర్నర్‌కు సీఎం, డిప్యూటీ సీఎం పూల బోకే ఇచ్చి మర్యాద పూర్వకంగా ఆహ్వానించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరగనున్నాయి. దీంతోపాటు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని ప్రధాన ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పోలీసులు ప్రకటించారు. ఈ ఆంక్షలు శనివారం ఉదయం నుంచి ఆదివారం రాత్రి 12 గంటల వరకు కొనసాగుతాయని వెల్లడిరచారు. గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌తో రాజ్‌భవన్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఆయన్ను ఆహ్వానించారు.