01-06-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, జూన్ 1: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డితో పాటు కేశవరావుతో మంత్రి పొన్నం ప్రభాకర్ మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. మంత్రి పొన్నం ప్రభాకర్ వెంట చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి, మాజీ ఎంపీ రాజయ్య ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో నాటి పోరాటాలను జానారెడ్డి, కేశవరావుతో కలిసి గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఈ సారి కాంగ్రెస్ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది.
ఉదయం, సాయంత్రం రెండు పూటలా వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఉదయం పరేడ్ గ్రౌండ్ లో.. సాయంత్రం ట్యాంక్ బండ్ పై వేడుకలు జరగనున్నాయి. ఆవిర్భావ వేడుకలకు ముఖ్య అతిథిగా సోనియా గాంధీ రానున్నారు. ఆవిర్భావ వేడుకల సందర్భంగా పరేడ్ గ్రౌండ్, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మరో వైపు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.